క్యాతనపల్లిలో హైడ్రామా.. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్

క్యాతనపల్లిలో హైడ్రామా.. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్

మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో మున్సిపల్ పీఠం కోసం సాగుతున్న పోరు కాస్తా రాజకీయ రణరంగంగా మారింది. బుధవారం ఉదయం నుంచే నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో మున్సిపల్ పీఠం కోసం సాగుతున్న పోరు కాస్తా రాజకీయ రణరంగంగా మారింది. బుధవారం ఉదయం నుంచే నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీఆర్ఎస్ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇంటిని పోలీసులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్తతలు తలెత్తకుండా ఆయన్ను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల చర్యను నిరసిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి అరెస్టును అడ్డుకునే ప్రయత్నం చేయడంతో తోపులాట జరిగి, ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది. సుమన్‌ను తరలిస్తున్న పోలీసు వాహనాన్ని కార్యకర్తలు అడ్డుకోవడంతో క్యాతనపల్లి పురవీధులు నిరసనలతో హోరెత్తాయి.

బందుతో స్తంభించిన పట్టణం.. మహిళా కౌన్సిలర్ల ఆవేదన
మంగళవారం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ సాగుతుండగా చోటుచేసుకున్న పరిణామాలు ఈ గొడవలకు బీజం వేశాయి. మంత్రి వివేక్ వెంకటస్వామి స్వయంగా రంగంలోకి దిగి ఎన్నికను అడ్డుకున్నారని, కాంగ్రెస్ కౌన్సిలర్లు తమపై దౌర్జన్యం చేస్తూ అసభ్యకరంగా ప్రవర్తించారని బీఆర్ఎస్, సీపీఐ మహిళా కౌన్సిలర్లు ఆరోపించారు. బుధవారం మీడియా ముందు వారు కన్నీటి పర్యంతమై తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ ఘటనకు నిరసనగా బీఆర్ఎస్, సీపీఐ పార్టీలు బుధవారం క్యాతనపల్లి పట్టణ బంద్‌కు పిలుపునిచ్చాయి. దుకాణాలు, వ్యాపార సంస్థలు మూతపడటంతో పట్టణమంతా నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ, రాజకీయ వర్గాల్లో మాత్రం మంటలు రేగుతున్నాయి.

Read More V3న్యూస్ ఛానల్ - విశ్వంభర దినపత్రిక  2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ--  ఆవిష్కారించిన సహకార సంఘం చైర్మన్ గోనె సరితా ప్రతాప్ రెడ్డి 

మంత్రి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే.. రాజకీయ యుద్ధం
మున్సిపల్ పీఠంపై పట్టు సాధించే క్రమంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య పంతం పట్టింది. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికను అధికార పార్టీ దుర్వినియోగం చేస్తోందని బాల్క సుమన్ ఆరోపిస్తుండగా, నిబంధనల ప్రకారమే అన్నీ జరుగుతున్నాయని కాంగ్రెస్ శ్రేణులు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ కౌన్సిలర్ల ప్రవర్తనపై మహిళా కౌన్సిలర్లు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే, తాజా అరెస్టులు, బంద్ పిలుపుల నేపథ్యంలో క్యాతనపల్లిలో అదనపు బలగాలను మోహరించారు. ఎన్నికల అధికారి తదుపరి నిర్ణయం ఏ విధంగా ఉంటుందోనని అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సామాన్య ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.