ఇక సిటీ బస్సుల్లోనూ లగేజ్ ర్యాక్స్ 

ఇక సిటీ బస్సుల్లోనూ లగేజ్ ర్యాక్స్ 

  • ప్రయోగాత్మకంగా 150 బస్సుల్లో ఏర్పాటు
  • త్వరలో మిగతా వాటిల్లో నూ ఏర్పాటు 

విశ్వంభర,  హైదరాబాద్:  దూరప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికులు బస్సెక్కగానే తమవెంట తెచ్చుకున్న లగేజీ ని బస్సులో తమ సీట్ల పైభాగంలో ఉండే ర్యాక్స్ పైన పెట్టడం చూస్తుంటాం,  దీంతో తమ వెంట తెచ్చుకున్న లగేజీ బరువు మోసే అవసరం వారికి ఉండదు. అయితే గ్రేటర్ పరిధిలో నడిచే సిటీ బస్సుల్లో ఆ సౌకర్యం లేదు. దీంతో ప్రయాణికులు తమ వెంట తెచ్చుకున్న బ్యాగుల బరువు మోస్తూ నిలబడాల్సిందే. ఈ విషయంలో విద్యార్థులు అధిక ఇబ్బందులకు గురవుతున్నారు. పలువురు ప్రయాణికులు లగేజీ సమస్య కు పరిష్కారం చూపాలని ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తెచ్చారు. అయితే అన్ని వేళల్లో బస్సుల్లో ఉండే రద్దీ నేపథ్యంలో ఈ సమస్య పరిష్కారానికి అవకాశం దొరకలేదు. అయితే ఇప్పుడు ఈ అంశంపై సీరియస్ గా దృష్టి సారించిన ఆర్టీసీ  గ్రేటర్ పరిధిలో తిరిగే సిటీ బస్సుల్లో కూడా ప్రయాణికులు తమ వెంట తెచ్చుకున్న లగేజీని పెట్టుకునేందుకు ర్యాక్ లను  ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.  సిటీ బస్సుల్లో ప్రయోగాత్మకంగా లగేజీ అటకలు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. తొలుత రెండు బస్సుల్లో ఏర్పాటు చేసి పరిశీలించింది.  ప్రయాణికుల అభిప్రాయ సేకరణ కోసం  మొదటి విడతగా ప్రయోగాత్మకంగా 150 బస్సుల్లో ఏర్పాటు చేయనున్నారు.  జిల్లా సర్వీసుల్లో ఉండేంత విశాలంగా కాకుండా, తక్కువ ఎత్తుతో ఉండేలా వాటిని ఏర్పాటు చేయనున్నారు. 
కాగా తెలంగాణ ఆర్టీసీకి ప్రత్యేకంగా మియాపూర్లో బస్ బాడీ నిర్మాణ యూనిట్ ఉండడంతో  ఈ ర్యాక్ ల ఏర్పాటు బాధ్యత  మియపూర్ బస్ బాడీ యూనిట్ కే అప్పగించారు. ఇందుకు ఒక్కో బస్సును రూ. 15 వేల ఖర్చు అవుతుందని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం 150 బస్సుల్లో ర్యాక్ ల ఏర్పాటు చేసే పని జరుగుతోంది. మరికొద్ది రోజుల్లో ఆ బస్సులు అటకలతో రోడ్డు ఎక్కనున్నాయి. అయితే ర్యాక్ లు ప్రయాణికులకు ఉపయోగకరమైన విధంగా  ఉన్నాయా, సిటీ బస్సు ల రద్దీ నేపథ్యంలో ప్రయాణికులు వాటిని వినియోగించుకుంటారా అనేది స్టడీ చేసి  హైదరాబాద్ పరిధిలో తిరిగే మిగతా సిటీ  బస్సుల్లో వాటి ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.  ప్రయాణికుల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న  తాజా నిర్ణయం ఎంతో  ఉపయోగకరమైంది. తక్కువ ఖర్చు తో కూడుకున్నది కావటంతో దీనికి సానుకూలత ఉంటుందని ఆర్టీసీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

Tags: