మే మొదటి వారంలో కవిత నూతన రాజకీయ పార్టీ
రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. త్వరలో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకోబోతుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎట్టకేలకు కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు స్వయంగా ప్రకటించారు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. త్వరలో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకోబోతుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎట్టకేలకు కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు స్వయంగా ప్రకటించారు. ఇవాళ జూబ్లీహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన కవిత ఇష్టాగోష్టిలో కీలక వివరాలు వెల్లడించారు. తెలంగాణ ప్రయోజనాలే పరమావధిగా మే మొదటి వారంలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు ఆమె ప్రకటించారు. సుమారు 19 ఏళ్లుగా సామాజిక, సాంస్కృతిక సేవలో ఉన్న తెలంగాణ జాగృతి, ఇకపై రాజకీయ క్షేత్రంలో ప్రజల పక్షాన పోరాడుతుందని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తుందని ఆమె హామీ ఇచ్చారు.
'తెలంగాణ' పేరుతోనే ఇంటి పార్టీ
పార్టీ పేరుపై వస్తున్న ఊహాగానాలపై కవిత స్పందిస్తూ.. తాను స్థాపించబోయే పార్టీ పేరులో ఖచ్చితంగా తెలంగాణ అనే పదం ఉంటుందని కవిత ధృవీకరించారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పార్టీల్లో తెలంగాణ అనే పదం లేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చిన తర్వాత, తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ లేకుండా పోయిందని అన్నారు. అందుకే తెలంగాణ పేరును తన పార్టీలో పెట్టాలనుకుంటున్నానని తెలిపారు. బీఆర్ఎస్ విధానాలతో విభేదించి బయటకు వచ్చిన తాను, ప్రజల ఆత్మగౌరవం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కవిత తెలిపారు. శాసనమండలిలో రాజీనామా ఆమోదం పొందే ముందు ఒక వ్యక్తిగా బయటకు వెళ్తున్నానని, ఒక రాజకీయ శక్తిగా తిరిగి వస్తాను అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదని, అందుకే కొత్త ప్రత్యామ్నాయం అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు.
సిద్దిపేట నుంచే కవిత పోటీ?
తమ పార్టీ రాబోయే ఎన్నికల్లో పూర్తిస్థాయిలో రంగంలోకి దిగుతుందని, తాను కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని కవిత స్పష్టం చేశారు. అభ్యర్థిగా ఎక్కడి నుంచైనా పోటీ చేసే అవకాశం ఉందని చెబుతూనే, తన ప్రాధాన్యతలను వెల్లడించారు. పోటీకి సంబంధించి మొదటి చాయిస్‌గా సిద్దిపేటను, రెండో చాయిస్‌గా బోధన్‌ను ఎంచుకుంటానని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ అంతటా పర్యటించి ప్రజల కష్టసుఖాలను తెలుసుకునేందుకు ఇప్పటికే జాగృతి జనం బాట కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. కేవలం ఒక కుటుంబం లేదా ఒక వ్యక్తి కనుసన్నల్లో కాకుండా, స్వతంత్రంగా ప్రజల కోసం పనిచేసే రాజకీయ వ్యవస్థను నిర్మిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఏప్రిల్ లేదా మే నాటికి పార్టీ విధివిధానాలు, జెండా, ఎజెండాను పూర్తిస్థాయిలో వెల్లడించనున్నారు.
ఉచిత బస్సు పథకంపై కీలక వ్యాఖ్యలు
తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వ సంస్థగా మార్చే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కవిత డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకంతో బస్సుల ఆక్యుపెన్సీ రేషియో పెరిగిందని, దీనివల్ల ఉద్యోగులపై పని ఒత్తిడి ఉందని ఆమె పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో బస్ బాడీ బిల్డింగ్ యూనిట్‌ను కర్ణాటకలోని దావణగెరెకు తరలించడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకానొక సందర్భంలో స్వయంగా మహిళలే అసలు ఉచిత బస్సు పథకం ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తున్నారని కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచిత బస్సుల కారణంగా మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని, అందుకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. మహిళలతో పాటు వికలాంగులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని కవిత డిమాండ్ చేశారు.
ఈ నెల 24న చలో సెక్రటేరియట్‌కు మద్దతు
బీఆర్ఎస్ హయాంలో కార్మికులు 52 రోజుల పాటు సమ్మె చేస్తే యూనియన్లను రద్దు చేసిన అంశాన్ని గుర్తు చేశారు. కానీ కార్మికుల సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వస్తే యూనియన్లను తిరిగి ఏర్పాటు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ మాటను నిలబెట్టుకోలేకపోవడం శోచనీయమన్నారు. ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల కోసం ఈ నెల 24న తలపెట్టిన చలో సెక్రటేరియట్‌కు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని కవిత వెల్లడించారు.



