పరేడ్ గ్రౌండ్‌లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్..!!

 పరేడ్ గ్రౌండ్‌లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్..!!

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌ను ఉత్సవ కళతో నింపుతోంది.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌ను ఉత్సవ కళతో నింపుతోంది. రంగురంగుల పతంగులతో ఆకాశం ఉల్లాసంగా మారగా, వేలాది మంది సందర్శకులు ఈ వేడుకలను ఆస్వాదించేందుకు పెద్దఎత్తున తరలివస్తున్నారు. పండుగ వాతావరణాన్ని తలపించేలా సాగుతున్న ఈ ఫెస్టివల్ నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Read More విద్యార్థులు తమ వంతు సహకారం అందించాలి.

 

ప్రపంచవ్యాప్తంగా పేరొందిన దాదాపు 19 దేశాల కైట్ ఫ్లయర్స్ ఈ వేడుకల్లో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివిధ ఆకారాలు, భారీ పరిమాణాల్లో రూపొందించిన పతంగులు ఆకాశంలో విహరిస్తూ సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. కొన్ని పతంగులు జంతువులు, పక్షులు, సాంప్రదాయ చిహ్నాల రూపంలో ఉండటం విశేషం. పిల్లల నుంచి పెద్దల వరకు అందరి ముఖాల్లో ఆనందాన్ని నింపుతున్నాయి.

 

కైట్ ఫెస్టివల్‌కు అనుబంధంగా నిర్వహిస్తున్న స్వీట్ ఫెస్టివల్ కూడా రుచుల పండుగగా మారింది. సుమారు 60 స్టాల్స్లో తెలంగాణతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ తీపి వంటకాలు అందుబాటులో ఉన్నాయి. లడ్డూలు, మైసూర్ పాక్, ఘర్ కా హల్వా, బెంగాలీ మిఠాయిలు, రాజస్థానీ స్వీట్లు ఇలా విభిన్న రుచులు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి.

 

ఈ మూడు రోజుల వేడుకలు జనవరి 13 నుంచి 15 వరకు కొనసాగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. కుటుంబ సమేతంగా వచ్చి వినోదం, సంస్కృతి, రుచుల కలయికను అనుభవించేందుకు ఇది అద్భుత అవకాశంగా మారింది. పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా తెలంగాణ పర్యాటక శాఖ చేపట్టిన ఈ ఉత్సవం నగరానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తోంది.

kite

Tags: