రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలి
విశ్వంభర, అంబర్‌పేట : మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు పుష్ప కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం, కుటుంబ సభ్యుడికి ఉద్యోగం కల్పించాలని కార్మికులు, అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. అంబర్‌పేటలో శుక్రవారం పూలే విగ్రహం వద్ద నిర్వహించిన ధర్నాలో ఏఐటీయూసీ నాయకుడు వెంకటేష్, కిషన్, వెంకటయ్య, ఏ. సురేష్ గౌడ్, శేఖర్, యాదగిరి, రుద్రయ్య మాట్లాడారు. హైదరాబాదు అంబర్‌పేట అలీ కేఫ్ చౌరస్తాలో గురువారం ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో పుష్ప మృతి చెందింది. ఈ ఘటనకు నిరసనగా పారిశుద్ధ్య కార్మికులు విధులు బహిష్కరించి ధర్నా చేపట్టారు. అనంతరం డీఎంసీ మారుతి ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. సిపిఎం నాయకుడు మహేందర్ మాట్లాడుతూ, నగరంలో పారిశుద్ధ్య కార్మికులు భద్రత లేకుండా పనిచేస్తున్నారని, ఇటువంటి ప్రమాదాలు పెరుగుతున్నాయని అన్నారు. మృతురాలి కుటుంబానికి జిహెచ్ఎంసి, ఆర్టీసీ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు వెంటనే అందజేయాలని, ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు.



