సుందరీకరణ పేరుతో పేదల ఇళ్ల కూల్చివేతలు సహించం

సుందరీకరణ పేరుతో పేదల ఇళ్ల కూల్చివేతలు సహించం

  •  ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న

విశ్వంభర, హైదరాబాదు : మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తే సహించమని ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న అన్నారు. తెలంగాణ సోషల్ ఫోరం చైర్మన్ నరసింహారెడ్డి అధ్యక్షతన హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ‘మూసీ సుందరీకరణ–వాదాలు’ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. సుందరీకరణకు ముందు మూసీలోని కాలుష్యాన్ని పూర్తిగా తొలగించి శుద్ధి చేయాలని సూచించారు. పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలను నియంత్రించకుండా అభివృద్ధి పనులు చేపట్టడం వల్ల ప్రయోజనం ఉండదన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలను నిర్వాసితులుగా మార్చకూడదని, నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకోవాలని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ మాట్లాడుతూ మూసీ సుందరీకరణ పేరుతో భారీ వ్యయ ప్రణాళిక రూపొందించి ప్రజలను తరలించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ముందుగా శుద్ధి చర్యలు చేపట్టాలని, ఖర్చు, ప్రయోజనం అంశాలను స్పష్టంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి అభివృద్ధి దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఉండాలని సూచించారు. తెలంగాణ స్టడీ ఫోరమ్ ప్రతినిధి శ్రీనివాస చారి పరివాహక ప్రాంతాల్లో కాలుష్య ప్రభావం తీవ్రంగా ఉందని, ముందుగా నియంత్రణ చర్యలు అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల నర్సింహారెడ్డి, కె. గోవర్ధన్, ఆయాచితం శ్రీధర్, రూబి స్టీవెన్సన్, గోగు శ్యామల, ప్రా. సీతారామరావు తదితరులు పాల్గొన్నారు.

Tags: