దాసిరెడ్డి శ్రవణ్  కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

దాసిరెడ్డి శ్రవణ్  కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

విశ్వంభర, రామన్నపేట: తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకుడు, యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, సిరిపురం గ్రామ మాజీ ఉప-సర్పంచ్ దివంగత  దాసిరెడ్డి శ్రవణ్ కుమార్ రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, వారి కుటుంబానికి భరోసానివ్వాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి రాపోలు నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుకుగా పాల్గొని, జైలు జీవితం గడిపి, అనంతరం సిరిపురం గ్రామానికి ఉప-సర్పంచిగా సేవలందించిన దాసిరెడ్డి శ్రవణ్ కుమార్ రెడ్డి అకాల మరణం తీవ్ర విషాదకరమని, తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి రాపోలు నరసింహా అన్నారు. కేవలం 39 సంవత్సరాల వయసులోనే ఆయన మన మధ్య లేకపోవడం సమాజానికి, సిరిపురం గ్రామానికి తీరని లోటు అని, ప్రజా సేవ పట్ల ఆయనకున్న అంకితభావం, ఉద్యమ సమయంలో చూపిన ధైర్యం యువతకు ఆదర్శం కావాలని అన్నారు. ఇలాంటి వ్యక్తి కుటుంబం నేడు దిక్కుతోచని స్థితిలో ఉండడం మనందరినీ కలచివేస్తోందని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, శ్రవణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి ఆర్థిక, సామాజిక భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని, తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను గౌరవిస్తూ, ఆయన కుటుంబానికి తగిన సహాయం అందించాలని, ఇది కేవలం ఒక కుటుంబాన్ని ఆదుకోవడమే కాకుండా, ఉద్యమంలో పాల్గొన్న ప్రతి వ్యక్తికి ప్రభుత్వం నిలబడుతుందనే నమ్మకాన్ని బలపరుస్తుందని, ఈ విషయంలో ప్రభుత్వం పెద్ద మనసుతో ముందుకు వచ్చి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని తెలిపారు.

Tags: