ఆయుర్వేదిక్ సేవలను వినియోగించుకోవాలి
విశ్వంభర, సిద్దిపేట: ప్రభుత్వ సమీకృత ఆయుష్ వైద్యశాలలో ఆయుర్వేదిక్, యునాని, హోమియోపతి వైద్య సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ హైమావతి సూచించారు. అర్బన్ మండలం ఎన్సాన్‌పల్లి గ్రామ శివారులోని ప్రభుత్వ సమీకృత ఆయుష్ వైద్యశాలలో ఉచిత ఆయుష్ మెగా వైద్య శిబిరాన్ని కలెక్టర్ శుక్రవారం ప్రారంభించారు. ప్రభుత్వ సమీకృత ఆయుష్ వైద్యశాలలో ఆయుర్వేదిక్, యునాని, హోమియోపతి ఓపీ వార్డులు, మెడిసిన్ పంపిణీ కేంద్రంలోకి వెళ్లి మెడిసిన్ తనిఖీ చేశారు. మందులివ్వడమే కాకుండా వాటిని ఎలా వాడాలి, ఆహారపు అలవాట్ల గురించి వివరించాలని డాక్టర్లను ఆదేశించారు. పలువురు రోగులతో మాట్లాడుతూ మోకాలి నొప్పులు, అజీర్ణం ఇతరత్ర సమస్యలున్న ఆయుష్‌లోనే వైద్యం చేయించుకోవాలన్నారు. పులుపు ఆహారానికి దూరంగా ఉండాలని, మొక్కజొన్న పజ్జొన్న గడ్కా, రాగి జావా లాంటివి తాగితే దృఢంగా ఉంటారని మంచి ఆహారం తీసుకోవాలని సూచించారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా ఒక్కోవారం ఒక్కో థీమ్‌తో కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. వృద్ధులకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ప్రతీ ఒక్కరికి ఆయుష్ కేంద్రంలో వైద్యం చేయించుకుంటే తప్పకుండా నయమవుతుందని సూచించారు. భవిష్యత్‌లో అవసరం ఉన్నవారికి సర్జరీ సేవలు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ కడవెర్గు మంజుల రాజ్‌నర్సు, ఆయుష్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉమాదేవి, ఎన్సీడీ పోగ్రాం ఆఫీసర్ డాక్టర్ వినోద్ బాబ్జీ, డాక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.



