కేరళపై సీఎం వ్యాఖ్యలు సరికాదు
విశ్వంభర, హైదరాబాదు : కేరళలోని వామపక్ష ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికావని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. హైదరాబాదు గోల్కొండ చౌరస్తాలోని సిపిఎం నగర కార్యాలయంలో శుక్రవారం ప్రారంభమైన గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ ముఖ్య కార్యకర్తల శిక్షణా తరగతుల్లో మాట్లాడారు. ఈ నెల 10 నుండి 12 వరకు నిర్వహిస్తున్న ఈ శిక్షణా తరగతులను జాన్ వెస్లీ ప్రారంభించారు. కేరళలో వామపక్ష ప్రభుత్వం పేదరిక నిర్మూలనలో ముందంజలో ఉందని, విద్య, వైద్య రంగాలు ప్రభుత్వ ఆధీనంలో సమర్థంగా కొనసాగుతున్నాయని తెలిపారు. మానవ అభివృద్ధి సూచికలో దేశంలోనే కేరళ మొదటి స్థానంలో ఉందని చెప్పారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయొద్దని కేరళ అసెంబ్లీ తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణలో విద్య, వైద్య రంగాలు ప్రైవేటు ఆధీనంలో ఉన్నాయని, ప్రజలు తీవ్ర ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పేదరిక పరిస్థితులపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయవద్దని తెలంగాణ అసెంబ్లీలో కూడా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా సిపిఎం పోరాడుతోందని, పార్టీపై దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. అంతర్జాతీయ పరిస్థితులపై మాట్లాడుతూ ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధ ప్రభావంతో దేశంలో గ్యాస్ కొరత ఏర్పడిందని, హోటళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నాయని అన్నారు. అమెరికా సామ్రాజ్యవాదాన్ని ప్రజలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం. శ్రీనివాసరావు, నగర కార్యదర్శి ఎం. వెంకటేష్. తదితరులు పాల్గొన్నారు.



