25న ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా
విశ్వంభర, బషీర్ బాగ్: ప్రైవేటు పాఠశాలలు విద్యను వ్యాపారంగా మార్చి నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్న ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25న ఇందిరాపార్కు ధర్నా చౌక్ లో 'మహా ధర్నా' నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా నేషనల్ రక్ష సేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తన్నారం నరసింహ యాదవ్ వెల్లడించారు. శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా నమావేశంలో మహాధర్నాకు సంబంధించిన గోడ పత్రికను ఆ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు లింగన్న, ప్రధాన కార్యదర్శి బింగి రాములుతో కలసి ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ప్రతి ఏడాది ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు 10 నుంచి 70 శాతం వరకు ఫీజులు పెంచడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజుల పెంపుపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో యాజమాన్యాలు ఇష్టారాజ్యాంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. స్కూల్ యాజమాన్యాలు చట్ట ప్రకారం కేవలం ట్యూషన్ ఫీజులు మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా డెవలప్మెంట్ పేరు చెప్పి దోపిడీ చేస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. ఈ ఫీజుల దోపిడీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25న నిర్వహించే మహాధర్నాలో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు రాజేశం, సాయిరాం, యాదగిరి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.



