పటాన్‌చెరులో ‘మైనింగ్’ మాఫియా

పటాన్‌చెరులో ‘మైనింగ్’ మాఫియా

  • సిట్ విచారణ జరపాల్సిందే!
  • కాంగ్రెస్ ఇన్ చార్జి  కాటా శ్రీనివాస్ గౌడ్ ధ్వజం

విశ్వంభర, సంగారెడ్డి : పటాన్‌చెరు నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మైనింగ్, భూ కబ్జాలపై కాంగ్రెస్ పార్టీ పటాన్‌చెరు ఇన్ చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం రామచంద్రాపురంలోని  తన స్వగృహంలో  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్యే , ఆయన అనుచరుల అక్రమ సంపాదనపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ​అసెంబ్లీలో మైనింగ్ అక్రమాలపై చర్చ జరిగినప్పుడు, వందల కోట్ల రూపాయల అవినీతిని కేవలం 'చిన్న తప్పు'గా చిత్రీకరించడం దురదృష్టకరమని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. మాజీ మంత్రి హరీశ్ రావుకు నిజాయితీ ఉంటే, మధుసూదన్ రెడ్డి వ్యవహారంపై తక్షణమే సీబీసీఐడీ  విచారణకు ఆదేశించాలని సవాల్ విసిరారు. పవిత్రమైన చట్టసభలో ప్రజా సమస్యలు పక్కన పెట్టి, అవినీతిపరులకు మద్దతుగా మాట్లాడటం సరికాదన్నారు.​ ​నియోజకవర్గంలో సాగుతున్న అక్రమాలను ఆయన వివరించారు, 2023లో 38 క్రషర్ల ద్వారా సుమారు రూ.380 కోట్ల విలువైన అక్రమ మైనింగ్ జరిగిందని, దీనిపై గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఖాజీపల్లి, కుత్బుల్లాపూర్ సరిహద్దుల్లో ఫైర్ స్టేషన్ పేరుతో రూ.90 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని పేర్కొన్నారు.ఇంద్రేశం పోచారం ప్రాంతాల్లో వేల కోట్ల రూపాయల విలువైన భూములను ఎమ్మెల్యే అనుచరులు కబ్జా చేశారని ధ్వజమెత్తారు.పాసుపుస్తకాలు ఇప్పిస్తామని నమ్మించి 117 మంది పేద రైతుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 2014తో పోలిస్తే ఎమ్మెల్యే ఆస్తులు ఏ స్థాయిలో పెరిగాయో పూర్తిస్థాయి విచారణ చేపట్టాలి. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై అభివృద్ధి నిధులను పక్కదారి పట్టించారనీ కాటా శ్రీనివాస్ గౌడ్ ఎద్దేవా చేశారు. ​లక్డారం ప్రాంతంలో అక్రమ మైనింగ్ బహిరంగంగా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. ఈ మొత్తం వ్యవహారాలపై ప్రభుత్వం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Tags: