చలాన్ పడితే అకౌంట్‌లో డబ్బులు కట్
రోడ్డు ప్రమాదాలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలు
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వాహన యజమాని బ్యాంకు ఖాతా నుంచి నేరుగా డబ్బులు కట్ అయ్యేలా కొత్త విధానాన్ని తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వాహన యజమాని బ్యాంకు ఖాతా నుంచి నేరుగా డబ్బులు కట్ అయ్యేలా కొత్త విధానాన్ని తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ యూసుఫ్‌గూడ పోలీస్ స్టేడియంలో నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనల అమలుపై పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. దేశంలో ప్రతి నిమిషానికి ఒక ప్రమాదం, ప్రతి మూడు నిమిషాలకు ఒక మరణం సంభవిస్తుండటంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వడం, డ్రంగ్ అండ్ డ్రైవ్ వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని తెలిపారు. ఇలాంటివారిపై కఠినంగా వ్యవహరించి నివారించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని సూచించారు.
వాహన రిజిస్ట్రేషన్ సమయంలోనే బ్యాంకు ఖాతాను లింక్ చేయాలని, దీనికోసం బ్యాంకర్లతో సమన్వయం చేసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. చలాన్లపై రాయితీలు ఇస్తారనే ధీమాతో వాహనదారులు నిబంధనలు అతిక్రమిస్తున్నారని.. ఇకపై చలాన్లపై ఎలాంటి డిస్కౌంట్లు ఉండవని స్పష్టం చేశారు. మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమైతే, వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయాలని పోలీసులకు సూచించారు. రోడ్డు ప్రమాద మరణాలను కేవలం ప్రమాదాలుగా చూడలేమని, అవి మనుషుల తప్పిదాల వల్ల జరుగుతున్న 'హత్యలే' అని సీఎం వ్యాఖ్యానించారు. శాంతిభద్రతల సమస్య కంటే ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలే పెద్ద సవాల్‌గా మారాయని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల విషయంలో రవాణా శాఖ, పోలీస్ శాఖ సమన్వయంతో పని చేయాలని సీఎం సూచించారు. చాలా సందర్బాల్లో మనకు సంబంధం లేకపోయినా ఎదుటివారి తప్పు వల్ల మనకు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు.
వ్యవస్థలో భారీ మార్పులు
ట్రాఫిక్ విభాగంపై పోలీసుల్లో ఉన్న చిన్నచూపును పోగొట్టేందుకు సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు సేఫ్టీ అథారిటీలో పోస్టింగ్ అంటే 'పనిష్మెంట్' అనే భావన పోవాలని, ఇకపై రోడ్డు సేఫ్టీ, ట్రాఫిక్ విభాగాల్లో డీజీ, అడిషనల్ డీజీ క్యాడర్ అధికారులను నియమిస్తామని ప్రకటించారు. హైడ్రా, సైబర్ క్రైమ్ విభాగాల తరహాలోనే ట్రాఫిక్ విభాగాన్ని బలోపేతం చేస్తామన్నారు. ఒకప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రమాదం ఉండేదని.. కానీ, ఇప్పుడు మర్డర్ కంటే రోడ్డు ప్రమాదాలు డేంజర్‌గా మారాయని పేర్కొన్నారు. ప్రస్తుతమున్న రవాణా విధివిధానాలను పూర్తిగా ప్రక్షాళన చేసి నూతన చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు. రోడ్డు భద్రతపై పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.



