సాయి సూర్య డెవలపర్స్‌కు ఈడీ షాక్
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సాయి సూర్య డెవలపర్స్ పేరుతో జరిగిన భారీ భూ కుంభకోణంపై ఈడీ తన దర్యాప్తును ముమ్మరం చేసింది.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సాయి సూర్య డెవలపర్స్ పేరుతో జరిగిన భారీ భూ కుంభకోణంపై ఈడీ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. తక్కువ ధరకు ప్లాట్లు ఇస్తామని, రిజిస్ట్రేషన్లు చేస్తామని నమ్మబలికి అమాయక పెట్టుబడిదారుల నుంచి ఈ సంస్థ కోట్లాది రూపాయలు వసూలు చేసింది. అయితే, విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఒకే ప్లాట్‌ను వేర్వేరు వ్యక్తులకు విక్రయించి, పత్రాలను సృష్టించి మోసానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. బాధితుల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని ప్రాజెక్టుల అభివృద్ధికి వాడకుండా, వ్యక్తిగత లాభాల కోసం మళ్లించినట్లు నిర్ధారణ కావడంతో రూ.14.63 కోట్ల విలువైన స్థిరాస్తులను ఈడీ ప్రాథమికంగా అటాచ్ చేసింది.
బ్యాంక్ ఖాతాల్లో లేయరింగ్.. నిధుల మళ్ళింపు
వసూలు చేసిన అక్రమ సొమ్మును దాచేందుకు సాయి సూర్య డెవలపర్స్ యాజమాన్యం పక్కా ప్లాన్ వేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నగదు, చెక్కులు, బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ల ద్వారా సేకరించిన నిధులను నేరుగా సంస్థ ఖాతాల్లో ఉంచకుండా, పలు బ్యాంక్ ఖాతాల ద్వారా 'లేయరింగ్' చేసినట్లు ఈడీ గుర్తించింది. నిధుల మూలాన్ని కప్పిపుచ్చేందుకు నిందితులు తమ కుటుంబ సభ్యులు, ఇతర అనుబంధ సంస్థల ఖాతాల్లోకి నిరంతరం లావాదేవీలు జరిపారు. తద్వారా బాధితులకు భారీ ఆర్థిక నష్టాన్ని మిగిల్చి, నిందితులు మాత్రం భారీగా లాభపడ్డారు. తెలంగాణ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తును వేగవంతం చేసింది.
తీగ లాగితే డొంక కదిలింది
సాయి సూర్య డెవలపర్స్ సంస్థ కేవలం ఒక్క ప్రాజెక్టుకే పరిమితం కాకుండా, 'గ్రీన్ మెడోస్' వంటి పలు వెంచర్ల పేరుతో మోసాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు అందాయి. ఈ సంస్థ ప్రమోటర్ సతీష్ చంద్ర గుప్తాతో పాటు సురానా గ్రూప్‌కు చెందిన నరేంద్ర సురానాపై కూడా ఆరోపణలు రావడంతో గతంలోనే సోదాలు జరిగాయి. ఈ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించిన ప్రముఖులకు అందిన చెల్లింపుల విషయంలోనూ ఈడీ ఆరా తీసినట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లు వేసి, ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని తప్పుదోవ పట్టించి చేసిన ఈ మోసంలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో విచారణ కొనసాగుతోంది. జప్తు చేసిన ఆస్తుల్లో ప్లాట్లు, సాగు భూములు ఉన్నట్లు తెలుస్తోంది.



