రెండేళ్లలో 'స్మార్ట్ సిటీ'గా నల్లగొండ

రెండేళ్లలో 'స్మార్ట్ సిటీ'గా నల్లగొండ

నల్లగొండ పట్టణాన్ని రాబోయే రెండేళ్లలో అద్భుతమైన స్మార్ట్ సిటీగా తీర్చిదిద్ది, అసలైన అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: నల్లగొండ పట్టణాన్ని రాబోయే రెండేళ్లలో అద్భుతమైన స్మార్ట్ సిటీగా తీర్చిదిద్ది, అసలైన అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. రాబోయే పదేళ్లలో నల్లగొండను ఒక భారీ పారిశ్రామిక కేంద్రంగా మారుస్తానని ప్రకటించారు. కేవలం భౌతిక అభివృద్ధి మాత్రమే కాకుండా, పట్టణంలో శాంతి సామరస్యాలను నెలకొల్పడమే తన ప్రథమ లక్ష్యమని, గంజాయి సంస్కృతిని, రౌడీయిజం వంటి అసాంఘిక కార్యకలాపాలను ఉక్కుపాదంతో అణచివేస్తామని మంత్రి హెచ్చరించారు.

శరవేగంగా మౌలిక సదుపాయాల కల్పన
పట్టణ అభివృద్ధి కోసం చేపట్టిన భారీ ప్రాజెక్టుల వివరాలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. రూ.900 కోట్లతో నిర్మిస్తున్న ఔటర్ రింగ్ రోడ్డు పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయని, ఆధ్యాత్మిక పర్యాటకానికి ఊతమిచ్చేలా లతీఫ్ సాబ్ గుట్ట, బ్రహ్మంగారి గుట్టలకు ఘాట్ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. పట్టణంలో ప్రధాన సమస్యగా ఉన్న లో-వోల్టేజ్ ఇబ్బందులను తొలగించేందుకు 8 సబ్ స్టేషన్ల నిర్మాణం, పాత లైన్ల మార్పిడి జరుగుతోందని పేర్కొన్నారు. ప్రజలకు 24 గంటల పాటు స్వచ్ఛమైన నీటిని అందించేలా కొత్త ట్యాంకులు నిర్మిస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను 'బొట్టు గూడా' పాఠశాల తరహాలో కార్పొరేట్ స్థాయిలో మారుస్తున్నామని వివరించారు. ఇప్పటికే రూ.84 కోట్లతో అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రం, రూ.20 కోట్లతో న్యాక్ (NAC) భవన పనులు పూర్తయినట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు.

Read More టైక్వాండోలో ప్రతిభ చాటిన సన్ షైన్ విద్యార్థి

క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు
మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని మంత్రి సూచించారు. శానిటేషన్, పార్కుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, మేయర్ నుండి కార్పొరేటర్ల వరకు అందరూ తమ డివిజన్లలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అభివృద్ధి పనుల నాణ్యతను పరిశీలించేందుకు తాను స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేస్తానని స్పష్టం చేశారు. పద్మావతి కాలనీ, శివాజీ నగర్‌లలో రూ.1.30 కోట్ల వ్యయంతో నిర్మించనున్న పార్కులకు ఆయన భూమి పూజ చేశారు. అలాగే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు లైనింగ్ పనులు ప్రారంభమయ్యాయని, బ్రాహ్మణవెల్లంల ద్వారా సాగునీటిని అందిస్తూ రైతులకు అండగా ఉంటామని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.