పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితాలో 'భారీ' ప్రక్షాళన.. 66 లక్షల ఓట్లు కట్!
పశ్చిమ బెంగాల్ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓటర్ల జాబితాలో భారీ మార్పులు జరిగాయి.
విశ్వంభర, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓటర్ల జాబితాలో భారీ మార్పులు జరిగాయి. గత ఏడాది నవంబర్ 4న 7.66 కోట్ల మంది ఓటర్లతో ప్రారంభమైన ఎస్‌ఐఆర్ ప్రక్రియ, అనేక విచారణల తర్వాత తుది అంకానికి చేరుకుంది. డిసెంబర్‌లో విడుదల చేసిన ముసాయిదా జాబితాలో అప్పట్లోనే 58 లక్షల ఓట్లను తొలగించగా, తుది జాబితా నాటికి ఆ సంఖ్య దాదాపు 66 లక్షలకు చేరుకుంది. మరణించిన వారు, శాశ్వతంగా వలస వెళ్ళిన వారు, నకిలీ ఓటర్లను గుర్తించి ఈ జాబితా నుంచి తొలగించినట్లు ఎన్నికల ప్రధాన అధికారి మనోజ్ అగర్వాల్ వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 7.04 కోట్లుగా నమోదైంది.
'అడ్జుడికేషన్'లో 60 లక్షల మంది
ఈ ప్రక్రియలో సుమారు 60.06 లక్షల మంది ఓటర్లను 'పరిశీలన' కేటగిరీలో ఉంచారు. వీరి దరఖాస్తుల్లో సాంకేతిక లోపాలు లేదా చిరునామా ధృవీకరణలో సమస్యలు ఉండటంతో, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నియమించబడిన జ్యుడిషియల్ అధికారులు వీటిని క్షుణ్ణంగా తనిఖీ చేయనున్నారు. వీరు క్లీన్ చిట్ ఇస్తేనే సప్లిమెంటరీ జాబితా ద్వారా ఓటు హక్కు లభిస్తుంది. లేదంటే ఈ 60 లక్షల ఓట్లు కూడా తొలగిపోయే ప్రమాదం ఉంది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.
భబానీపుర్‌లో పెను మార్పులు.. రాజకీయ రచ్చ
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న భబానీపుర్ నియోజకవర్గంలో కూడా భారీగా ఓట్లు గల్లంతయ్యాయి. ఇక్కడ దాదాపు 47 వేల ఓట్లను తొలగించగా, మరో 14 వేల మందిని పరిశీలన జాబితాలో చేర్చారు. ఓట్ల తొలగింపుపై అధికార తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. కాగా, నకిలీ ఓటర్లను తొలగించడం ద్వారా పారదర్శకమైన ఎన్నికలకు మార్గం సుగమం అయిందని బీజేపీ పేర్కొంటోంది. అసెంబ్లీ ఎన్నికలకు కేవలం కొద్ది నెలల సమయం మాత్రమే ఉండటంతో, ఈ ఓటర్ల జాబితా అంశం బెంగాల్ రాజకీయాలను మరింత వేడెక్కించింది.



