కళాకారులకు గుర్తింపు కార్డులు

కళాకారులకు గుర్తింపు కార్డులు

 విశ్వంభర, హైదరాబాదు :  తెలంగాణ రాష్ట్రంలోని కళాకారులకు గుర్తింపు కార్డుల మంజూరు ప్రక్రియ ప్రారంభించడంపై తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం హర్షం వ్యక్తం చేసింది. ఇది కళాకారుల పోరాట ఫలితమని రాష్ట్ర అధ్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ, భాషా సాంస్కృతిక శాఖ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆర్టిస్ట్ ఐడి కార్డ్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్డుల ద్వారా కళాకారులకు ప్రభుత్వ పథకాలు, రాయితీలు అందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. దరఖాస్తు అనంతరం జిల్లా పౌర సంబంధాల అధికారి సంతకం తప్పనిసరి చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ విధానంలో మళ్లీ కార్యాలయాలకు వెళ్లాల్సి రావడం డిజిటల్ విధానానికి విరుద్ధమని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల కళాకారులకు ఇది భారమవు తుందని, అవినీతి, మధ్యవర్తుల ప్రమేయం పెరిగే అవకాశముందని అన్నారు. ఈ నేపథ్యంలో ధృవీకరణ నిబంధనను తొలగించి, ఆన్‌లైన్‌లోనే తనిఖీలు పూర్తి చేసి నేరుగా డిజిటల్ కార్డులు అందించే విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిబంధనల సరళీకరణ కోసం పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

Tags: