కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు

కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు

  • సీఎం చంద్రబాబు

విశ్వంభర,  అమరావతి: వైసీపీ హయాంలో 20 కోట్ల లడ్డూలను కల్తీ నెయ్యితో తయారు చేశారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అధికారులు, నిపుణులు అందరూ కలిసి కుట్రలు చేశారని ఆక్షేపించారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై శాసనసభలో నిర్వహించిన లఘు చర్చలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ‘మహాపాపం’ పేరిట వైసీపీ హయాంలో లడ్డూ కల్తీ జరిగిన తీరును పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా ఆయన వివరించారు. 
‘‘రాజకీయ వివాదం ఉండకూడదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సిట్‌ ఏర్పాటు చేశారు. సీబీఐ ఆధ్వర్యంలో విచారణకు సిట్‌ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సీబీఐ రిపోర్టు పంపించింది. అందుకే ఏకసభ్య కమిటీ వేయాలని నిర్ణయించాం. లడ్డూ వ్యవహారంలో కాకుండా అనేక విషయాల్లో తప్పులు చేశారు. 2019-24 మధ్య 59.71లక్షల లీటర్ల కల్తీ నెయ్యి వినియోగించారు. రూ.231.51 కోట్ల అక్రమాలు జరిగాయి. ఫుడ్ సేఫ్టీ నిబంధనలను నీరుగార్చారు. ఒక పద్ధతి ప్రకారం లాలూచీ పడిన లూటీ అని స్పష్టంగా తేలింది. కల్తీ నెయ్యి అని నిర్ధారణ అయినా రిపోర్టును తొక్కిపెట్టారు. లడ్డూలో జంతుకొవ్వు కలిసిందని నేను సొంతంగా ఏమీ చెప్పలేదు. ఎన్‌డీడీబీ ఇచ్చిన రిపోర్టునే చెప్పా. ఆ భగవంతుడే నాతో చెప్పించాడు’’ అని చంద్రబాబు అన్నారు. 
అవన్నీ ఈవో, ఛైర్మన్‌కు తెలియకుండా జరుగుతాయా?..
‘‘వారికి అనుగుణంగా నిబంధనలన్నీ సడలించారు. రోజుకు 4 లక్షల లీటర్ల పాలు కొనుగోలు చేయాలన్న నిబంధన తొలగించారు. నెయ్యి ఉత్పత్తిలో అనుభవాన్ని మూడేళ్ల నుంచి ఏడాదికి కుదించారు. రోజుకు 12 టన్నులుగా ఉండాల్సిన వెన్న తయారీ ఎనిమిది టన్నులకు తగ్గించారు. డెయిరీల వార్షిక టర్నోవర్‌ రూ.250 కోట్ల నుంచి రూ.150 కోట్లకు పరిమితం చేశారు. సాంకేతిక అధ్యయనం, ఫీల్డ్‌ విజిట్లకు పూర్తిగా మినహాయింపు ఇచ్చారు. ఫుడ్‌ సేఫ్టీ నిబంధనలను నీరుగార్చారు. పోమిల్‌ జైన్‌, విపిన్‌ జైన్‌, భోలేబాబా ఆర్గానిక్‌ డెయిరీ ప్రధాన సూత్రధారులు. నెయ్యి సరఫరా చేసిన షెల్‌ కంపెనీలు ఏఆర్‌ డెయిరీ ఫుడ్స్‌, శ్రీవైష్ణవి డెయిరీ, మాల్‌ గంగా మిల్క్‌ డెయిరీ. భోలే బాబా డెయిరీకి షెల్‌ కంపెనీలు సహకరించాయి. లంచం డబ్బుతో చిన్నప్పన్న దొరికిపోయారు. కల్తీ నెయ్యి సరఫరాదారులకు చిన్నప్పన్న సహకారం అందించారు. తప్పుడు రిటర్నులతో బురిడీ కొట్టించారు. ల్యాబ్‌ నివేదిక ఫోర్జరీ చేశారు. ఇన్ని జరిగితే తితిదే బోర్డు ఈవో, ఛైర్మన్‌కు తెలియకుండా జరుగుతాయా? ప్రసాదం తీసుకున్న ప్రతి ఒక్కరూ నాణ్యత తగ్గిందని చెప్పారు’’ అని సీఎం తెలిపారు.

Tags: