స్నేహితుడికి సాయం చేయబోయి.. రూ.7కోట్ల సైబర్‌ నేరంలో చిక్కుకొన్న ఇంజినీరింగ్ విద్యార్థి

స్నేహితుడికి సాయం చేయబోయి.. రూ.7కోట్ల సైబర్‌ నేరంలో చిక్కుకొన్న ఇంజినీరింగ్ విద్యార్థి

విశ్వంభర, నేషనల్ బ్యూరో:  స్నేహితుడికి సాయం చేయబోయి.. 19 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థి రూ.7 కోట్ల సైబర్‌ నేరంలో చిక్కుకున్న ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరులోని ఓ ప్రముఖ కళాశాలలో ఇంజినీరింగ్‌ చేస్తున్న 19 ఏళ్ల విద్యార్థికి నవంబరులో అతడి స్నేహితుడు ఆయుష్‌ ఫోన్‌ చేశాడు. బ్యాంకు ఖాతాలో తగినంత బ్యాలెన్స్‌ లేకపోవడం వల్ల తన ఖాతా బ్లాక్‌ అయ్యిందని.. కొద్ది రోజుల పాటు వినియోగించుకోవడానికి బ్యాంకు ఖాతాను ఇవ్వాలని విద్యార్థిని కోరాడు.ఏడాదిగా అతడితో పరిచయం ఉండడంతో.. తన కర్ణాటక గ్రామీణ బ్యాంక్ పాస్‌బుక్, ఏటీఎం కార్డ్, నెట్‌బ్యాంకింగ్ వివరాలు, ఖాతాకు లింక్ చేసి ఉన్న ఎయిర్‌టెల్ సిమ్ కార్డ్‌ వివరాలను విద్యార్థి తన స్నేహితుడు ఆయుష్‌కు పంపించాడు. ఫిబ్రవరి 20న కర్ణాటక గ్రామీణ బ్యాంక్ అధికారులు సదరు విద్యార్థిని సంప్రదించి అతడి ఖాతా నుంచి అక్రమ లావాదేవీలు జరిగినట్లు తెలిపారు. షెల్‌ కంపెనీ పేరుతో కేవలం రెండు రోజుల్లోనే సైబర్‌ నేరగాళ్లు విద్యార్థి ఖాతా నుంచి రూ.7 కోట్లను వివిధ ఖాతాలకు మళ్లించినట్లు అధికారులు పేర్కొన్నారు.  రంగంలోకి దిగిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఈ వ్యవహారానికి సంబంధించి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విద్యార్థి స్నేహితుడు ఆయుష్‌ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఖాతా వివరాలను అతడు విదేశాల్లోని సైబర్‌ నేరగాళ్లకు విక్రయించినట్లు తెలిసింది. దీంతో వెంటనే సదరు ఖాతాను బ్లాక్‌ చేసినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామన్నారు.

Tags: