మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఊరట

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఊరట

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. 2023లో సత్తెనపల్లిలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల లక్కీ డ్రా వ్యవహారంలో నమోదైన కేసులో గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు బుధవారం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది.

విశ్వంభర, ఏపీ బ్యూరో: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. 2023లో సత్తెనపల్లిలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల లక్కీ డ్రా వ్యవహారంలో నమోదైన కేసులో గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు బుధవారం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా అంబటిని తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సత్తెనపల్లి పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి తోసిపుచ్చారు. దీంతో గత కొంతకాలంగా వరుస కేసులతో ఇబ్బందులు పడుతున్న ఆయనకు ఈ తీర్పు పెద్ద ఉపశమనంగా మారింది.

విడుదలపై వీడని ఉత్కంఠ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసుతో పాటు మరికొన్ని ఫిర్యాదుల నేపథ్యంలో అంబటి రాంబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల సమయంలో పోలీసులను బెదిరించారన్న ఆరోపణలపై పట్టాభిపురం పోలీసులు నమోదు చేసిన కేసులో ఈనెల 11నే ఆయనకు గుంటూరు ఎక్సైజ్ కోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే, అదే సమయంలో సంక్రాంతి లక్కీ డ్రా కేసులో పీటీ వారెంట్ జారీ కావడంతో ఆయన జైలు నుండి విడుదల కాకుండా అడ్డంకులు ఎదురయ్యాయి. తాజా కోర్టు నిర్ణయంతో ఆ అడ్డంకులు తొలగిపోయాయి.

Read More Pawan Kalyan: కులాల చిచ్చు సహించం..!!

రాజకీయ కోణంలో విచారణ
సంక్రాంతి సంబరాల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా లక్కీ డ్రా నిర్వహించి నిధులు వసూలు చేశారన్నది అంబటిపై ఉన్న ప్రధాన ఆరోపణ. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం, పోలీసుల కస్టడీ విన్నపాన్ని తిరస్కరిస్తూనే బెయిల్ మంజూరు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రభుత్వం కావాలనే పాత కేసులను తిరగదోడి తనను ఇబ్బంది పెడుతోందని అంబటి తరపు న్యాయవాదులు వాదించగా, విచారణకు సహకరించడం లేదని పోలీసులు పేర్కొన్నారు.