చంచల్‌గూడ జైలు నుండి విడుదలైన ఐబొమ్మ నిర్వాహకుడు రవి
సినిమా రంగంలో సంచలనం సృష్టించిన పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మంది రవి ఎట్టకేలకు చంచల్‌గూడ జైలు నుండి విడుదలయ్యాడు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: సినిమా రంగంలో సంచలనం సృష్టించిన పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మంది రవి ఎట్టకేలకు చంచల్‌గూడ జైలు నుండి విడుదలయ్యాడు. గత మూడు నెలలుగా రిమాండ్‌లో ఉన్న రవికి మంగళవారం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బుధవారం జైలు అధికారులు విడుదల ప్రక్రియ పూర్తి చేశారు. వెబ్‌సైట్ ద్వారా కొత్త సినిమాలను పైరసీ చేస్తూ చిత్ర పరిశ్రమకు భారీగా గండి కొడుతున్నాడనే ఆరోపణలపై గతంలో పోలీసులు అరెస్ట్ చేశారు.
విచారణలో రవి కార్యకలాపాలకు సంబంధించిన అనేక విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. రవి ఓ ఐలాండ్ కేంద్రంగా ఈ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అని, వ్యక్తిగత జీవితంలో భార్యతో విడాకులు తీసుకున్నట్లు విచారణలో తేలింది. కేవలం అక్రమంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే పైరసీ మార్గాన్ని ఎంచుకున్నట్లు వెల్లడైంది. దీనివల్ల చిత్ర పరిశ్రమకు వేల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని పోలీసు వర్గాలు నిర్ధారించాయి.
పైరసీ సినిమాలను అడ్డం పెట్టుకుని రవి వివిధ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తూ కోట్ల రూపాయలు వెనకేసినట్లు ఆధారాలు లభించాయి. జైలుకు వెళ్లిన నాటి నుండి పలుమార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా, విచారణ కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో న్యాయస్థానం తాజాగా అతనికి విముక్తి కల్పించింది. జైలు నుండి బయటకు వచ్చిన రవి తదుపరి కదలికలపై పోలీసులు నిఘా ఉంచే అవకాశం కనిపిస్తోంది.



