బందిపోట్లలా దళిత నేత అరెస్టా?: కేటీఆర్
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఒక దళిత నాయకుడైన బాల్క సుమన్‌ను ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, అకస్మాత్తుగా బందిపోట్ల మాదిరిగా అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని ఆయన ధ్వజమెత్తారు. మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవాలనే ఏకైక లక్ష్యంతో రేవంత్ రెడ్డి సర్కార్ అడ్డదారుల్లో వెళ్తోంది. ఇది ప్రభుత్వ అసమర్థతకు, పిరికిపందతనానికి నిదర్శనం అని కేటీఆర్ మండిపడ్డారు. అరెస్ట్ చేసిన బాల్క సుమన్‌ను తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
మంత్రి వివేక్ డైరెక్షన్‌లో ఎన్నికల ప్రక్రియ
క్యాతనపల్లిలో జరుగుతున్న ఎన్నిక కేవలం నామమాత్రంగానే ఉందని, తెరవెనుక మంత్రి వివేక్ వెంకటస్వామి నేరుగా అధికారులపై ఒత్తిడి తెస్తూ ఎన్నికల ప్రక్రియను శాసిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. మంత్రి కళ్లసైగలకు అనుగుణంగా రిటర్నింగ్ ఆఫీసర్లు, పోలీసులు నడుచుకోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన వ్యవస్థలు కాంగ్రెస్ నాయకుల చేతిలో కీలుబొమ్మలుగా మారాయని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ, దానిని అణచివేసేందుకు ప్రభుత్వం పోలీసు బలగాలను ఉపయోగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసులకు హెచ్చరిక.. ప్రతిఫలం తప్పదు
పోలీసు యంత్రాంగం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 'ప్రైవేట్ సైన్యం'లా మారిపోయిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. బాల్క సుమన్‌తో పాటు పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలను వేధించడం మానుకోవాలని ఆయన సూచించారు. "ఇప్పుడు అధికార పార్టీకి అడుగులకు మడుగులొత్తుతూ, అక్రమాలకు పాల్పడుతున్న ప్రతి ఒక్క పోలీస్ అధికారి గుర్తుంచుకోవాలి.. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. భవిష్యత్తులో మీరు చేసిన ప్రతి తప్పుకు తగిన ప్రతిఫలం చెల్లించుకోవాల్సి ఉంటుంది" అని ఆయన గట్టిగా హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.



