విడాకులు ఇచ్చిందని మాజీ భార్య దారుణ హత్య
వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీలో ఘటన
హైదరాబాద్ శివారు వనస్థలిపురంలో బుధవారం పట్టపగలే ఒక మహిళ దారుణ హత్యకు గురైంది. తనతో విడిపోయి రెండో వివాహం చేసుకుందన్న కక్షతో సునీత అనే మహిళను ఆమె మాజీ భర్త మహేష్ అతి కిరాతకంగా చంపేశాడు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ శివారు వనస్థలిపురంలో బుధవారం పట్టపగలే ఒక మహిళ దారుణ హత్యకు గురైంది. తనతో విడిపోయి రెండో వివాహం చేసుకుందన్న కక్షతో సునీత అనే మహిళను ఆమె మాజీ భర్త మహేష్ అతి కిరాతకంగా చంపేశాడు. వనస్థలిపురంలోని గ్రీన్‌సిటీ కాలనీలోని ఒక అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న సునీత నివాసానికి వెళ్లిన మహేష్.. వెంట తెచ్చుకున్న కత్తులతో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. రక్తపు మడుగులో పడివున్న సునీత అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. కేవలం కత్తులే కాకుండా, వెంట పెట్రోల్ డబ్బాను లోపలికి వెళ్లాడు.
విడత రాని విద్వేషం.. రెండో పెళ్లిపై కక్ష
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. సునీతకు గతంలోనే మహేష్‌తో వివాహమైంది. అయితే వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు రావడంతో ఏడాది క్రితమే చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు. అనంతరం సునీత మరో వ్యక్తిని వివాహం చేసుకుని గ్రీన్ సిటీ కాలనీలో నివాసం ఉంటోంది. విడాకులు ఇచ్చినప్పటి నుంచి ఆమెపై ద్వేషం పెంచుకున్న మహేష్.. తనను మోసం చేసిందని, విడిపోయి మరొకరితో ఎలా ఉంటుందని తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఆమెను అంతమొందించాలని నిశ్చయించుకుని ఈ దారుణానికి ఒడిగట్టాడు.
నిందితుడిని పట్టుకున్న స్థానికులు
హత్య చేసిన అనంతరం అపార్ట్‌మెంట్ నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న మహేష్‌ను స్థానికులు, అపార్ట్‌మెంట్ వాసులు అడ్డుకున్నారు. అతడిని పట్టుకుని వెంటనే వనస్థలిపురం పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడు మహేష్ తన నేరాన్ని అంగీకరించాడని, సునీత రెండో వివాహం చేసుకోవడాన్ని తట్టుకోలేకే ఈ హత్య చేశానని చెప్పినట్లు పోలీసులు తెలిపారు.



