గ్రీన్ ఎనర్జీయే భవిష్యత్ కరెన్సీ

మహారాష్ట్ర 'క్లైమేట్ వీక్' సదస్సులో పర్యావరణ పరిరక్షణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం

గ్రీన్ ఎనర్జీయే భవిష్యత్ కరెన్సీ

గ్రీన్ ఎనర్జీ అనేది కేవలం ఒక నినాదం మాత్రమే కాదు, అది భవిష్యత్తు తరాలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రతిష్టాత్మక ‘క్లైమేట్ వీక్’ సదస్సులో ఆయన పాల్గొని 'గ్రీన్ తెలంగాణ' రోడ్ మ్యాప్‌ను ప్రపంచ వేదికపై ఆవిష్కరించారు.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: గ్రీన్ ఎనర్జీ అనేది కేవలం ఒక నినాదం మాత్రమే కాదు, అది భవిష్యత్తు తరాలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రతిష్టాత్మక ‘క్లైమేట్ వీక్’ సదస్సులో ఆయన పాల్గొని 'గ్రీన్ తెలంగాణ' రోడ్ మ్యాప్‌ను ప్రపంచ వేదికపై ఆవిష్కరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం అమలు చేస్తున్న 30 లక్షల పంప్‌సెట్లు, 50 లక్షల గృహాలకు అందిస్తున్న ఉచిత విద్యుత్ పథకాలను బొగ్గు వంటి సాంప్రదాయ వనరుల నుంచి కాకుండా సోలార్, గ్రీన్ ఎనర్జీ వైపు మళ్లించడమే తన ప్రధాన లక్ష్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యుత్ ఉత్పాదక వనరులే ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా అసలైన బలం అని, ఆ దిశగా తెలంగాణ అడుగులు వేస్తోందని పునరుద్ఘాటించారు.

హైదరాబాద్‌కు సరికొత్త గుర్తింపు.. 2034 లక్ష్యం
భారతదేశంలోనే కార్బన్ ఫుట్‌ప్రింట్ ఆడిట్ చేపట్టనున్న తొలి నగరంగా హైదరాబాద్‌ను నిలబెడతామని ముఖ్యమంత్రి సంచలన ప్రకటన చేశారు. 2034 నాటికి నగరాన్ని 'నెట్-జీరో' (కర్బన ఉద్గారాలు లేని) నగరంగా మార్చడమే తమ సంకల్పమని తెలిపారు. ఇందులో భాగంగా 'కోర్ అర్బన్ రీజియన్' (CURE)లో రాబోయే ఐదేళ్లలో ఎటువంటి కాలుష్య కారక పరిశ్రమలు ఉండవని, వాటిని పెరి-అర్బన్ జోన్లకు తరలిస్తామని వెల్లడించారు. 1991లో మొదలైన ఎల్‌పీజీ సంస్కరణల వల్ల భారత్ సేవా రంగంలో గ్లోబల్ హబ్‌గా ఎదిగిందని, అయితే తయారీ రంగంలో వెనుకబడిన లోటును ఇప్పుడు భర్తీ చేస్తామని చెప్పారు. ప్రపంచ పెట్టుబడిదారులు చైనాకు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న తరుణంలో, తెలంగాణను 'చైనా +1' తయారీ కేంద్రంగా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Read More బ్రేకింగ్ న్యూస్..- డిసిసి ప్రెసిడెంట్ పున్న కైలాష్ నేతకు అవమానం

ఆర్థిక వృద్ధికి మూడు స్తంభాలు
తెలంగాణ జీడీపీని ప్రస్తుతమున్న 200 బిలియన్ డాలర్ల నుంచి 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లకు, స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాల నాటికి (2047) 3 ట్రిలియన్ డాలర్లకు పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సీఎం తెలిపారు. రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి అభివృద్ధిని వికేంద్రీకరిస్తున్నట్లు వివరించారు. CURE: ఐటీ, సర్వీస్ మరియు క్లీన్ టెక్నాలజీ హబ్, PURE: ఉత్పత్తి మరియు తయారీ రంగాల కేంద్రం, RARE: వ్యవసాయం, గ్రీన్ ఎనర్జీ, గ్రామీణ పరిశ్రమలు, ఔటర్ రింగ్ రోడ్ (ORR), రీజినల్ రింగ్ రోడ్ (RRR) మధ్య ప్రాంతాన్ని ప్రధాన తయారీ జోన్‌గా అభివృద్ధి చేస్తామని, దీనివల్ల వేలాది మంది యువతకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.

పర్యావరణ పరిరక్షణలో కఠినం.. హైడ్రా ఏర్పాటు
కేవలం పారిశ్రామిక వృద్ధే కాకుండా, సహజ వనరుల రక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అందుకోసమే 'హైడ్రా' పేరిట ప్రత్యేక పోలీసు దళాన్ని ఏర్పాటు చేశామని, చెరువులు, కుంటల ఆక్రమణలను తొలగించి వాతావరణ సమతుల్యతను కాపాడతామని తెలిపారు. మూసీ నది పునరుద్ధరణ ప్రాజెక్టు ద్వారా నగరానికి కొత్త రూపునిస్తామని, వాటర్ గ్రిడ్ ద్వారా వనరుల నిర్వహణ చేపడతామని వివరించారు. రవాణా రంగంలో మార్పు కోసం 3,500 ఎలక్ట్రిక్ బస్సులు, 2 లక్షల ఆటోలను పర్యావరణ హితంగా మార్చడం, మెట్రోను 200 కిలోమీటర్లకు విస్తరించడం వంటి పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో పేర్కొన్నారు.

Related Posts