ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠంపై వీడిన స్టే

ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠంపై వీడిన స్టే

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో గత రెండు రోజులుగా సాగుతున్న రాజకీయ హైడ్రామాకు తెలంగాణ హైకోర్టులో తెరపడింది. మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై గతంలో విధించిన స్టేను ఎత్తివేస్తూ ధర్మాసనం బుధవారం కీలక తీర్పునిచ్చింది. 

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో గత రెండు రోజులుగా సాగుతున్న రాజకీయ హైడ్రామాకు తెలంగాణ హైకోర్టులో తెరపడింది. మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై గతంలో విధించిన స్టేను ఎత్తివేస్తూ ధర్మాసనం బుధవారం కీలక తీర్పునిచ్చింది. ఈ ఎన్నికకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని జిల్లా కలెక్టర్‌కు అప్పగించింది. 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి అదృశ్యమయ్యారంటూ ఆయన కుమారుడు దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. యాదగిరిని నేరుగా తన ముందు హాజరుపరచాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో బుధవారం కోర్టుకు హాజరైన యాదగిరి, తన అదృశ్యం వెనుక ఉన్న వాస్తవాలను ధర్మాసనం ముందు వివరించారు.

మాజీ ఎమ్మెల్యేపై కౌన్సిలర్ తీవ్ర ఆరోపణలు
న్యాయస్థానంలో యాదగిరి వాంగ్మూలం ఇస్తూ.. మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఆయన కుమారుడు తనను బలవంతంగా తీసుకెళ్లి బాపట్ల జిల్లా చీరాలలో బందీగా ఉంచారని ఆరోపించారు. తాను బీఆర్ఎస్ తరఫున మున్సిపల్ చైర్మన్ రేసులో ఉన్నందున, తనను అడ్డుకోవడమే లక్ష్యంగా బౌన్సర్లను పెట్టి శారీరకంగా, మానసిక ఇబ్బందులకు గురిచేశారని పేర్కొన్నారు. నిన్నటి ఎన్నికల సమయంలో తనను బలవంతంగా తీసుకువచ్చి ప్రమాణ స్వీకారం చేయించారని, అంతా ఇష్టపూర్వకంగానే జరుగుతోందని చెప్పాలంటూ ప్రలోభపెట్టారని కోర్టుకు తెలిపారు. నిష్పక్షపాతంగా మళ్లీ ఎన్నిక నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేయగా, ధర్మాసనం స్పందిస్తూ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు యాదగిరికి పూర్తి రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది.

Read More బార్ కౌన్సిల్ ఎన్నికలకు నామినేషన్‌కు దాఖలు చేసిన టీపీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్

కలెక్టర్ నిర్ణయంపైనే సర్వత్రా ఆసక్తి
హైకోర్టు స్టే ఎత్తివేయడంతో ఇప్పుడు బంతి జిల్లా కలెక్టర్ కోర్టులోకి చేరింది. నిజానికి నిన్న నిర్వహించిన ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి టేకు సుదర్శన్ రెడ్డి చైర్మన్‌గా ఎన్నికైనట్లు ప్రకటించినా, హైకోర్టు స్టే ఆదేశాల నేపథ్యంలో గెలుపు ధ్రువీకరణ పత్రాలను అధికారులు నిలిపివేశారు. ఇప్పుడు కోర్టు స్టేను తొలగించడమే కాకుండా, యాదగిరిపై ఎలాంటి ఒత్తిడి ఉండకూడదని స్పష్టం చేసిన నేపథ్యంలో కలెక్టర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. పాత ఎన్నిక ఫలితాన్నే ధ్రువీకరిస్తారా లేక యాదగిరి విన్నపం మేరకు కొత్తగా నోటిఫికేషన్ జారీ చేస్తారా అన్న దానిపై మున్సిపల్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.