కాంగ్రెస్ కు రైతులంటే చిన్న చూపు

కాంగ్రెస్ కు రైతులంటే చిన్న చూపు

విశ్వంభర, సిద్దిపేట: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని  మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదటి నుంచి రైతులంటే చిన్న చూపే ఉందని ఆరోపించారు. గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమయానికి రైతుబంధు అందించారని, వ్యవసాయాన్ని రాష్ట్రానికి వెన్నెముఖగా నిలిపారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పంట కోతకు వచ్చిన కూడా రైతుబంధు డబ్బులు జమ చేయలేదన్నారు. కందుల కొనుగోళ్లలో రైతులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరుస్తున్న నియమ నిబంధన వల్ల తక్కువ ధరకే రైతులు కందులను బయట మార్కెట్లో అమ్ముకుంటున్నారన్నారు. రైతులు యూరియా దొరకక ఇబ్బందులు పడుతున్నారని,  షాపుల్లో లేని యూరియా యాపుల్లో ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఉగాది పండుగలోగా రైతులందరికీ రైతుబంధు అందించి, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో రైతుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో కౌన్సిలర్లు నాగరాజు రెడ్డి, మల్లిఖార్జున్, నాయకులు రెడ్డి ప్రభాకర్ రెడ్డి, పొన్నమల్ల రాములు, ఇర్షాద్ హుస్సేన్, సత్యం రెడ్డి, దరిపల్లి శ్రీనివాస్, సయీద్ , సాయి చరణ్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: