ఏం సాధించారని సంబరాలు

-రైతు భరోసా సొమ్ము ఎగ్గొట్టినందుకా? ఈ సంబరాలు

-స్థానిక సంస్థల ఎన్నికల కోసమే ఈ రుణమాఫీ డ్రామా

WhatsApp Image 2024-07-20 at 15.29.40_9fb083e4

విశ్వంభర భూపాలపల్లి జూలై 20 : - ఏం సాధించారని రుణమాఫీ సంబరాలు చేసుకుంటున్నారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ  భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల శాఖ అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ ప్రశ్నించారు. శనివారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రుణమాఫీ చేశామంటూ కాంగ్రెస్ సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. రభీ, ఖరీఫ్ లో చెల్లించాల్సిన రైతు భరోసా ఎగ్గొట్టినందుకు సంబరాలు చేసుకుంటున్నారా? రుణమాఫీలో కోత పెట్టి..రైతులను మోసం చేసినందుకా? పంట నష్టపరిహారం ఇవ్వకుండా అన్నదాతలను గోస పెట్టినందుకు సంబరాలు చేసుకుంటున్నారా? అని నిలదీశారు. గత ఎన్నికల్లో రూ.2 లక్షల లోపు రుణాలు తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కొర్రీల మీద కొర్రీలు పెడుతూ..కొంతమందికే రుణమాఫీ చేయడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బిసి) లెక్కల ప్రకారం రాష్ట్రంలో రైతులు తీసుకున్న రుణాల మొత్తం రూ.64 వేల కోట్లకు పై మాటే అని అన్నారు. అందులో 10వ వంతు మాత్రమే చెల్లించి సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఖరీఫ్, రబీ సీజన్ లో రైతులకు చెల్లించాల్సిన రైతు భరోసా సొమ్ము ఎగ్గొట్టి..ఆ డబ్బులో కొంత భాగాన్ని రుణమాఫీకి మళ్లించి.. రైతులకు మేలు చేసినట్లు ఫోజు కొడతారా? అని ప్రశ్నించారు. ఎన్నికల హామీ మేరకు రైతులకు కొత్త రుణాలు మంజూరు చేయించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ది పొందేందుకే రుణమాఫీ డ్రామాలు తెరపైకి తెచ్చారని వెంకటేష్ గౌడ్ మండిపడ్డారు.

Read More పయనీరింగ్ ఎక్సలెన్స్‌తో వజ్రా ఈవెంట్స్ 13వ వార్షికోత్సవం