బాబు జగ్జీవన్ రామ్ సామాజిక న్యాయ సాధకుడు

బాబు జగ్జీవన్ రామ్ సామాజిక న్యాయ సాధకుడు

విశ్వంభర, సిద్దిపేట:  బాబు జగ్జీవన్ రామ్ దేశ రాజకీయాల్లో సుదీర్ఘ కాలం విశిష్ట సేవలు అందించి, సామాజిక న్యాయసాధనకు కృషిచేసిన మహానేత అని జిల్లా కలెక్టర్ హైమావతి కొనియాడారు. ఒక నాయకుడు ఉన్నత స్థాయికి ఎదగాలంటే సవాళ్లను ఎదుర్కొని, సమస్యలను అధిగమించే ధైర్యం అవసరమన్నారు. జగ్జీవన్ రామ్ కేంద్ర ప్రభుత్వంలో పలు శాఖలకు మంత్రిగా పనిచేయడమే కాకుండా దేశ ఉప ప్రధానిగా సమర్థవంతమైన సేవలు అందించారని గుర్తుచేశారు. జిల్లా కేంద్రంలోని బీజేఆర్ చౌరస్తాలో బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ హైమావతి హాజరై దళిత సంఘాల నాయకులతో కలిసి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.  అనంతరం నేతలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహనీయుల ఆశయాలు, కృషిని ఆదర్శంగా తీసుకుని సమాజంలో వివక్ష లేకుండా ప్రతీ ఒక్కరు ఉన్నత వ్యక్తిత్వంతో ఎదగాలని ఆకాంక్షించారు. అంబేద్కర్ సమాజంలోని అన్నివర్గాల అభ్యున్నతికి కృషిచేసిన మహోన్నత నాయకుడని, మహిళల సాధికారత, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని చెప్పారు. అందరికీ అవకాశాలను కల్పించే దిశగా మన కోసం రిజర్వేషన్ విధానాన్ని అమలుచేసిన ఘనత అంబేద్కర్‌కు దక్కుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, మెరుగైన వసతులు అందించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. షెడ్యూల్డ్ కులాలకు అవసరమైన నిధుల కేటాయింపునకు సంబంధించిన పనులు వేగవంతం చేస్తామన్నారు. అనంతరం బీజేఆర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీఆర్ఓ నాగరాజమ్మ, ఆర్డీఓ సదానందం, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి హమీద్, నాయకులు బొమ్మల యాదగిరి, నాయకులు బైరి రాజేశం, ఎర్ర మహేందర్, లింగంపల్లి శ్రీనివాస్, బయ్యారం ఇస్తారి, పరుశరాములు, డి.శంకర్, భీమసేన, ఎల్లేష్, రామస్వామి, చుంచు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags: