పండుగట పూట 'చైనా మాంజా' మృత్యుపాశం
పండుగ పూట సరదాగా సాగే గాలిపటాల ఆట ఒక కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: పండుగ పూట సరదాగా సాగే గాలిపటాల ఆట ఒక కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. నిషేధిత చైనా మాంజా ప్రాణాంతకమని తెలిసినా.. కొందరి నిర్లక్ష్యం కారణంగా ఒక సామాన్య కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. బైక్‌పై వెళ్తుండగా మెడకు మాంజా చుట్టుకుని, గొంతు తెగి అక్కడికక్కడే మరణించిన ఘటన సంగారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అవిదేశ్ (35) ఉపాధి నిమిత్తం సంగారెడ్డిలో నివసిస్తున్నాడు. బుధవారం సాయంత్రం తన బైక్‌పై పని నిమిత్తం వెళ్తుండగా, ఫసల్వాది గ్రామ సమీపంలో గాలిపటం తెగి కిందకు వేలాడుతున్న చైనా మాంజా అతడికి అడ్డుపడింది. అవిదేశ్ బైక్‌పై వేగంగా వెళ్తుండటంతో, గాలిలో ఉన్న మాంజాను గమనించలేకపోయాడు. ఒక్కసారిగా ఆ దారం అతడి మెడకు చుట్టుకుంది. నైలాన్‌తో తయారైన ఆ మాంజా అవిదేశ్ మెడకు చుట్టుకోవడంతో తీవ్ర రక్తస్రావమై, బైక్ పైనుంచి కిందపడిపోయిన ఆయన నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలు విడిచారు.
రోడ్డుపై వెళ్తున్న వ్యక్తి ఒక్కసారిగా గొంతు తెగి పడిపోవడం చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ ప్రాంతంలో నిషేధిత మాంజా వాడుతున్న వారిపై ఆరా తీస్తున్నారు. చైనా మాంజా వాడకం, విక్రయాలపై కఠిన నిషేధం ఉందని పోలీసులు తెలిపారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.



