రైతులకు ఆధునిక సాంకేతికత చేరువ కావాలి: హరీష్ రావు
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మైదానంలో కొనసాగుతున్న రైతుబడి అగ్రిషోను బీఆర్ఎస్ నేత హరీష్ రావు సందర్శించారు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మైదానంలో కొనసాగుతున్న రైతుబడి అగ్రిషోను బీఆర్ఎస్ నేత హరీష్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా ప్రదర్శనలోని స్టాళ్లను తిలకించి, రైతుల కోసం ఏర్పాటు చేసిన వినూత్న సాంకేతికతను పరిశీలించారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ.. రైతులకు అగ్రిషో ఎన్నో రకాలుగా దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. ఇలాంటి ప్రదర్శనలు ప్రభుత్వం స్వయంగా నిర్వహిస్తే సాగు రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని, రైతులకు మరింత మేలు జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న యూరియా కొరతను నివారించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
అసెంబ్లీలో రైతుల పక్షాన పోరాటం
రైతులకు అవసరమైన ఆధునిక వ్యవసాయ పరికరాలను భారీ సబ్సిడీపై అందించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. సాగు పనిముట్లకు రాయితీలు కల్పించే అంశంపై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో రైతుల పక్షాన గట్టిగా చర్చిస్తానని భరోసా ఇచ్చారు. సాంకేతికతను సామాన్య రైతుకు అందుబాటులోకి తెచ్చినప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని స్పష్టం చేశారు. ఈ నెల 20న ప్రారంభమైన ఈ ప్రతిష్టాత్మక వ్యవసాయ ప్రదర్శన 22వ తేదీ వరకు కొనసాగనుంది. దేశ, విదేశాలకు చెందిన సుమారు 500కు పైగా కంపెనీలు తమ స్టాళ్లను ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పిస్తున్నాయి.
అత్యాధునిక సాంకేతికతకు వేదిక
ఈ ప్రదర్శనలో ముఖ్యంగా నూతన యంత్రాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీ వంటి అత్యాధునిక అంశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీటితో పాటు విత్తనాలు, మొక్కలు, ఎరువులు, డ్రిప్ పరికరాల వంటివి రైతులకు ప్రదర్శనకు ఉంచారు. మూడు రోజుల పాటు సాగే ఈ వేడుకలో వ్యవసాయ రంగ నిపుణులతో ప్రత్యేక సదస్సులు కూడా నిర్వహిస్తున్నారు. సందర్శకులు www.rbagrishow.com వెబ్ సైట్ ద్వారా ముందస్తుగా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని, నేరుగా వచ్చే వారికి కూడా ప్రవేశం ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు.



