హెల్త్ కార్డులు ఇవ్వాలి
విశ్వంభర, హైదరాబాద్ : 010 పద్దులో వేతనాలు పొందని ఉపాధ్యాయులు, ఉద్యోగులకు కూడా హెల్త్ కార్డులు మంజూరు చేయాలని టిఎస్ యుటిఎఫ్ డిమాండ్ చేసింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల జేఎసి ఆధ్వర్యంలో ప్రతినిధులు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి వినతిపత్రం సమర్పించారు. నూతన ఈహెచ్ఎస్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినందుకు మంత్రి కి కృతజ్ఞతలు తెలియజేశారు. టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి మాట్లాడుతూ, 010 పద్దులో వేతనాలు పొందని మోడల్ స్కూళ్లు, గురుకులాలు, ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, కేజీబీవీ, యూఆర్ఎస్, సమగ్ర శిక్ష మరియు వివిధ పబ్లిక్ రంగ సంస్థల్లో పనిచేస్తున్న నియమిత, కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ నూతన ఈహెచ్ఎస్‌ను తొలి దశలోనే వర్తింపజేయాలని కోరారు. ఈ సందర్భంగా వినతిపత్రాన్ని మంత్రికి అందజేశారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఎస్ యుటిఎఫ్ ప్రధాన కార్యదర్శి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.



