ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి
విశ్వంభర, సిద్దిపేట: సీఎం పర్యటనలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఆయా శాఖలకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ హైమావతి జిల్లా అధికారులను ఆదేశించారు. హెలిప్యాడ్ ఏర్పాటు, బహిరంగ సభ, ఫ్యాక్టరీ ప్రారంభం, స్టాళ్లు, శిలాఫలకం ఆవిష్కరణ తదితర అన్ని కార్యక్రమాలు ప్రోటోకాల్ ప్రకారం ఉండాలన్నారు. వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, విజయ ఎండీ చంద్రశేఖర్ రెడ్డిలతో కలిసి నంగునూరు మండలం నర్మెట్టలోని ఆయిల్‌ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభం సందర్భంగా మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కార్యక్రమానికొచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తాగునీరు, మరుగుదొడ్లు సౌకర్యాలు కల్పించాలని సూచించారు. వ్యవసాయశాఖ సంచాలకులు గోపి మాట్లాడుతూ రైతులందరికీ ఉపయోగపడే గొప్ప కార్యక్రమం ఆయిల్‌ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవమన్నారు. ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయిల్‌ఫామ్ ఫ్యాక్టరీ మేనేజర్ శ్రీకాంత్, వ్యవసాయ, హర్టికల్చర్, ఆర్అండ్‌బీ, పోలీస్, ఆయిల్‌ఫెడ్, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.



