ఆశా కార్యకర్తల ‘ఛలో హైదరాబాదు’ ఉద్రిక్తత
- కమిషనర్ ఆఫీస్ ముట్టడికి యత్నం.. తోపులాట
విశ్వంభర, హైదరాబాదు : పెండింగ్ పారితోషికాలు వెంటనే చెల్లించాలని, నెలకు రూ.18,000 ఫిక్స్డ్ వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు సోమవారం ‘ఛలో హైదరాబాదు’ పిలుపునిచ్చారు. కోటి కమిషనర్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నిర్బంధాలు చేపట్టినా వేలాదిమంది ఆశాలు కోటికి చేరుకున్నారు. 1204 మెట్రో పిల్లర్ వద్ద నుంచి ర్యాలీగా బయల్దేరిన వారిని నాలుగు రహదారుల సిగ్నల్ వద్ద పోలీసులు ఆపారు. ఈ సందర్భంగా తోపులాట జరిగి పలువురికి గాయాలయ్యాయి. మధ్యాహ్నం వరకు కమిషనర్ ఆఫీస్ సమీపంలో ధర్నా నిర్వహించిన ఆశాలు, సమస్యలు వినకుండా అరెస్టులు చేయడం తగదని విమర్శించారు. డిమాండ్లు పరిష్కరించకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆశా యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలు పి. జయలక్ష్మి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. నీలా దేవీ, రాష్ట్ర కోశాధికారి పి. గంగమణి, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జే. వెంకటేష్, మీనా, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.



