పన్నుల వసూలుకై స్పెషల్ డ్రైవ్
విశ్వంబర, మిర్యాలగూడ : మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్ను, నీటి పన్ను, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ అద్దెల వసూళ్ల కోసం స్పెషల్ డ్రైవ్‌ను మున్సిపల్ కమిషనర్ జి శ్రీనివాస్, డిప్యూటీ ఇంజనీర్ వెంకన్న, రెవిన్యూ ఆఫీసర్ జ్ఞానేశ్వరి, మున్సిపల్ బృందం ఆధ్వర్యంలో ప్రారంభించారు. మున్సిపాలిటీ ఆర్థిక వనరులను బలోపేతం చేసి పట్టణ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, రహదారుల మరమ్మతులు, వీధి దీపాల నిర్వహణ వంటి పౌర సేవలను మెరుగుపరచడం ఈ డ్రైవ్ ముఖ్య ఉద్దేశ్యం అని వారు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ జి. శ్రీనివాస్ పట్టణంలోని ఆస్తి యజమానులు, వ్యాపారులు, ట్రేడ్ లైసెన్స్, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ కిరాయిదారులు తమ పెండింగ్ బకాయిలను తక్షణమే చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. పన్నులు, అద్దెలను సమయానికి చెల్లించడం ప్రతి పౌరుడి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్ లో కమిషనర్ జి. శ్రీనివాస్, డిప్యూటీ ఇంజనీర్ వెంకన్న, రెవెన్యూ ఆఫీసర్ జ్ఞానేశ్వరి, ఇతర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.



