ఎన్సీఈఆర్టీ వివాదాస్పద బుక్‌ను నిషేధించిన సుప్రీం

ఎన్సీఈఆర్టీ వివాదాస్పద బుక్‌ను నిషేధించిన సుప్రీం

విశ్వంభర, నేషనల్ బ్యూరో: జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్రం కొత్త పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతిపై ఒక అధ్యాయాన్ని ప్రచురించడం వివాదం అవుతోంది. ఈ అంశాన్ని సుమోటోగా పరిగణించిన సుప్రీంకోర్టు.. గురువారం విచారణను ప్రారంభించింది. ఇది న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు చేసిన కుట్రేనంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ వ్యవహారంలో బాధ్యులకు శిక్ష పడాలని సీజేఐ తీవ్రంగా స్పందించారు. ఈ విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానానికి కేంద్రం బేషరతుగా క్షమాపణలు చెప్పింది. ఈ వ్యవహారాన్ని తాము సమర్థించుకోవడం లేదని ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వెల్లడించారు.ఈ విచారణలో సుప్రీంకోర్టు  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘వాళ్లు ప్రయోగించిన బుల్లెట్‌తో న్యాయవ్యవస్థ రక్తం చిందిస్తోంది. న్యాయవ్యవస్థ అధికారాన్ని అణచివేసేలా, గౌరవాన్ని కించపర్చేలా ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యగా కనిపిస్తోంది. దీనిని పట్టించుకోకుండా ఇలాగే వదిలేస్తే.. ప్రజలు, యువత మనసుల్లో న్యాయవ్యవస్థ పవిత్రత దెబ్బతినే అవకాశం ఉంది’’ అని ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘అలాగే న్యాయవ్యవస్థ పాత్ర వివరించేందుకు ఒక పూర్తి అధ్యాయాన్ని ఎన్‌సీఈఆర్‌టీ కేటాయించింది. కానీ కోర్టుల విశిష్ట చరిత్రను మాత్రం వదిలేసింది. జవాబుదారీతనం ఏర్పడేవరకు ఈ వ్యవహారాన్ని మేం వదిలివేయబోం. దీనికి వెనక ఎవరు ఉన్నారో మేం తెలుసుకోవాలనుకుంటున్నాం’’ అని వ్యాఖ్యానించారు.అలాగే ఎన్‌సీఈఆర్‌టీ వివాదాస్పద పుస్తకంపై నిషేధం విధించింది. ఆ నిషేధాన్ని ఉల్లంఘిస్తే.. కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఆ సంస్థ డైరెక్టర్, స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీకి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరించాలని ఆదేశించింది. ఈ సందర్భంగా తుషార్‌ మెహతా స్పందిస్తూ.. న్యాయవ్యవస్థకు తామెప్పుడూ అండగా ఉంటామన్నారు. పబ్లిక్ నోటీసు ద్వారా బేషరతుగా క్షమాపణలు చెప్తామని కోర్టుకు తెలియజేశారు. తదుపరి విచారణ మార్చి 11న జరగనుంది.
ఇదీ జరిగింది..
పుస్తకంలో న్యాయవ్యవస్థపై అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయని సీనియర్‌ న్యాయవాదులు కపిల్‌ సిబల్, అభిషేక్‌ సింఘ్వీలు సీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. బుధవారం దానిపై స్పందించిన సీజేఐ..‘‘న్యాయవ్యవస్థకు కళంకం ఆపాదించేలా ఎవరు ప్రవర్తించినా అనుమతించను’’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.ఈ నేపథ్యంలో న్యాయవ్యవస్థలో అవినీతి గురించిన పాఠ్యాంశంతో కూడుకున్న పుస్తక పంపిణీని నిలిపివేయాల్సిందిగా ఎన్‌సీఈఆర్‌టీని కేంద్ర విద్యాశాఖ ఇప్పటికే ఆదేశించింది. అసంబద్ధమైన విషయాలు పాఠ్యాంశంలో వచ్చాయని, నిర్ణయం తీసుకోవడంలో పొరపాటు వల్ల ఇలా జరిగిందని ఎన్‌సీఈఆర్‌టీ తెలిపింది. పాఠ్యపుస్తకాన్ని అధికారిక వెబ్‌సైట్‌ నుంచి తొలగించింది. అసంబద్ధమైన అంశాలను ప్రచురించినందుకు క్షమాపణ చెప్పింది.

Tags: