సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయి పర్యటనలు
- మున్సిపల్ కమిషనర్ హన్మంతరెడ్డి
విశ్వంభర,సూర్యాపేట: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించేందుకు మున్సిపల్ యంత్రాంగం కృషి చేస్తోంది అని సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ హన్మంతరెడ్డి తెలిపారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా పట్టణంలోని 15, 17, 27, 28, 31, 36, 46, 47 వార్డుల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ, మురికి కాలువల పరిస్థితి, రహదారుల సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డుల వారీగా ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముఖ్యంగా పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి చెత్త తొలగింపు, మురుగు కాలువల శుభ్రత కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.ప్రజలు కూడా పట్టణ పరిశుభ్రతకు సహకరించాలని, ఇంటి వద్దే తడి, పొడి చెత్తను వేర్వేరుగా వర్గీకరించి మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని సూచించారు.మున్సిపాలిటీ అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం ప్రజల సహకారం అవసరమని తెలిపారు. ఈ పర్యటనలో మున్సిపల్ కౌన్సిలర్లు అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.



