కోర్టు మందలించినా ఆగని 'టికెట్' బాదుడు

కోర్టు మందలించినా ఆగని 'టికెట్' బాదుడు

తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపు వ్యవహారం హాట్‌టాపిక్ గా మారింది. సామాన్య ప్రేక్షకుడి జేబుకు చిల్లు పెడుతున్న ఈ 'ధరల పెంపు' విషయంలో ప్రభుత్వ వైఖరి, కోర్టుల హెచ్చరికలు, మంత్రుల విరుద్ధ ప్రకటనలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి.

విశ్వంభర తెలంగాణ బ్యూరో: తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపు వ్యవహారం హాట్‌టాపిక్ గా మారింది. సామాన్య ప్రేక్షకుడి జేబుకు చిల్లు పెడుతున్న ఈ 'ధరల పెంపు' విషయంలో ప్రభుత్వ వైఖరి, కోర్టుల హెచ్చరికలు, మంత్రుల విరుద్ధ ప్రకటనలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. కేవలం బడా నిర్మాతల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిన్నటి వరకు హైకోర్టు గట్టిగా మందలించినా, 24 గంటలు తిరగకముందే మళ్ళీ రేట్లు పెంచుకునేందుకు అనుమతులు ఇస్తూ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

న్యాయస్థానం ఆగ్రహం.. ప్రభుత్వ బేఖాతరు?
ప్రభాస్ నటించిన 'రాజాసాబ్' సినిమా టికెట్ల పెంపు విషయంలో రాష్ట్ర హైకోర్టు శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేసింది. "ప్రతిసారి సెలవుల ముందే ఇలాంటి ఉత్తర్వులు ఇస్తారా? చట్టవిరుద్ధమైన మెమోల ద్వారా ధరలు పెంచడం ఏంటి?" అంటూ న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.నిబంధనల ప్రకారం కాకుండా మెమోల రూపంలో ఇచ్చిన అనుమతులను కొట్టివేస్తూ, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకూడదని స్పష్టం చేసింది.

Read More సికింద్రాబాద్‌ ముక్కలైతే సహించం

కొద్ది గంటల్లోనే అనుమతి
అయితే కోర్టు తీర్పు వెలువడిన కొద్ది గంటల్లోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాకు ధరలు పెంచుతూ ప్రభుత్వం మరో మెమో జారీ చేయడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఇది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు
మరోవైపు తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారంపై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా సమావేశంలో శనివారం చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతోంది. ప్రస్తుతం విడుదలైన'ది రాజాసాబ్' సంక్రాంతి కానుకగా విడుదల కానున్న 'మన శంకర్ వరప్రసాద్ గారు' వంటి పెద్ద సినిమాల టికెట్ ధరల పెంపు ఫైళ్లు తన దృష్టికి రాలేదనడం.. ఆ మెమోలు ఎలా జారీ అయ్యాయో కూడా తెలియదనడంపై విమర్శలు వస్తున్నాయి.సినీ ఇండస్ట్రీ వ్యవహారాలను తాను పట్టించుకోవడం ఎప్పుడో మానేశానని అననడంపై పలు సందేహాలకు తావిస్తోంది. గతంలో 'పుష్ప-2' సినిమా ప్రీమియర్ షో సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించిన ఘటన తర్వాత టికెట్ రేట్లు పెంచాలని గానీ, బెనిఫిట్ షోల అనుమతి కోసం గానీ ఎవరూ తన దగ్గరకు రావొద్దని నిర్మాతలకు, సినీ పెద్దలకు స్పష్టంగా చెప్పానని, మరీ ఈ సినిమాలకు ధరలు పెంచిందనే విషయం తనకు తెలియదనడంపై రాజకీయ ప్రతిపక్షాలకు ఇది ఆయుధంగా మారనుందని పలువురు అంటున్నారు.

నిబంధనలు బేఖాతరు
సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాల నిర్మాతలు షూటింగ్ పూర్తయ్యాక ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ధరలు పెంచుకోవడం ఇప్పుడు సాధారణం అయ్యింది. అదనంగా వసూలు చేసే మొత్తంలో 20 శాతం సినీ కార్మికుల సంక్షేమ నిధికి ఇవ్వాలనే నిబంధనను ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. నిబంధనల ప్రకారం జీవో ఇవ్వకుండా.. కోర్టు సెలవులకు ముందు మెమోలు ఇచ్చి చేతులు దులుపుకోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. అయితే మంత్రికి తెలియకుండానే జీవోలు, మెమోలు ఎలా విడుదలవుతున్నాయనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ప్రభుత్వంలో సమన్వయ లోపం ఉందా? లేక తెర వెనుక ఏవైనా ఒత్తిళ్లు పనిచేస్తున్నాయా? అనే చర్చ సోషల్ మీడియాలో  చర్చ జరుగుతోంది. హైకోర్టు ఆదేశాలను గాలికొదిలేసి, తన ఇష్టానుసారం వ్యవహరిస్తున్న ప్రభుత్వం భవిష్యత్తులో కోర్టు ధిక్కరణ చర్యలను ఎదుర్కోవాల్సి రావొచ్చని విశ్లేషకులు అంటున్నారు.