యుద్ధం ఆపాల్సింది ట్రంపే
- కె. నారాయణ
విశ్వంభర, గుంటూరు : యుద్ధం ఆపండి అని ప్రభుత్వం ప్రకటించడం సరిపోదు, యుద్ధాన్ని ప్రారంభించినవారే దాన్ని ఆపాలి, ట్రంప్ తక్షణమే చర్యలు తీసుకోవాలి అని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె. నారాయణ అన్నారు. గుంటూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో భయానక పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత్ తటస్థంగా కాకుండా శాంతి చర్చలకు నాయకత్వం వహించాలని ప్రధాని మోదీకి సూచించారు. ఇరాన్‌పై జరిగిన సైనిక దాడులను నిలిపివేయడానికి అమెరికా, ఇజ్రాయిల్‌లతో భారత్ సంప్రదింపులు జరపాలని కోరారు. గల్ఫ్ దేశాల్లో ఇరుక్కున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యుద్ధ ప్రభావంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని, దాని ప్రభావం నిత్యావసర వస్తువులపై పడుతుందని చెప్పారు. నక్సలిజంపై మాట్లాడుతూ సమస్యలు ఉన్నంతకాలం అది కొనసాగుతుందని పేర్కొన్నారు. ‘నక్సల్ ఫ్రీ ఇండియా’ కంటే ‘పావర్టీ ఫ్రీ ఇండియా’ సాధిస్తే నక్సలిజం స్వయంగా తగ్గిపోతుందని వ్యాఖ్యానించారు. ఖనిజ సంపదను కార్పొరేట్లకు అప్పగించే విధానాలను విమర్శించారు. ధార్మిక సంస్థల్లో కాంట్రాక్టర్లు, కార్పొరేట్ ప్రతినిధులను చైర్మన్లుగా నియమించే సంస్కృతి మారాల్సిన అవసరం ఉందన్నారు. భద్రాచలం దేవస్థానం పరిధిలోని ఐదు పంచాయితీలను తెలంగాణాకు కేటాయించడం సముచితమని అభిప్రాయపడ్డారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచించిన మధ్యవర్తిత్వ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అగ్రిగోల్డ్ ఆస్తులను అటాచ్ చేసి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు చట్ట పరిమితుల్లోనే పనిచేయాలని, వ్యవస్థలను గౌరవించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి, పరిపాలనా లోపాలపై ఆందోళన వ్యక్తం చేశారు.



