సినిమాలు సమాజంలో చైతన్యం తేవాలి
విశ్వంభర, చిక్కడపల్లి : “దేశ చరిత్రలో చోటుచేసుకున్న వాస్తవ సంఘటనలను నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకురావడం అవసరం, ఇలాంటి చిత్రాలు సమాజంలో చైతన్యం పెంచుతాయి” అని రాజ్యసభ సభ్యుడు కే. లక్ష్మణ్ అన్నారు. హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాంతంలోని ఓడియన్ థియేటర్ మల్టీప్లెక్స్‌లో ప్రదర్శితమవుతున్న “ద కేరళ స్టోరీ–2” చిత్రాన్ని ఆయన వీక్షించారు. ఈ సందర్భంగా ముషీరాబాదు నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. చిత్రం అనంతరం మీడియాతో మాట్లాడిన కే. లక్ష్మణ్, కాశ్మీరీ పండితులు అనుభవించిన వేదన, వారి త్యాగం, దేశభక్తి భావాన్ని ప్రతిబింబించే చిత్రాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులు, మోసాలు, మత మార్పిడి పేరుతో జరిగే అన్యాయాలను ఖండించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. యువత, మహిళలు అప్రమత్తంగా ఉండాలని, సమాజంలో అవగాహన పెంపొందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చ ఆల్ ఇండియా నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పూసరాజు, బీజేపీ మహంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్, సికింద్రాబాదు పార్లమెంటు జాయింట్ కన్వీనర్ వినయ్ కుమార్, జైపాల్ రెడ్డి, శివాజీ తదితరులు పాల్గొన్నారు.



