సికింద్రాబాద్ ముక్కలైతే సహించం
17న నల్లజెండాలతో శాంతియాత్ర.. సికింద్రాబాద్ బంద్‌కు పిలుపు
సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా జరుగుతున్న కుట్రలను తిప్పికొడతామని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.
విశ్వంభర తెలంగాణ బ్యూరో: సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా జరుగుతున్న కుట్రలను తిప్పికొడతామని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఆదివారం బాలంరాయిలోని ‘లీ ప్యాలెస్’లో లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన కీలక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సికింద్రాబాద్ అంటే కేవలం ఒక ప్రాంతం కాదు.. అదొక చరిత్ర, ఒక అస్తిత్వమని పేర్కొన్నారు. డీలిమిటేషన్ పేరుతో గూగుల్ మ్యాప్‌లు పట్టుకుని గీతలు గీస్తూ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. సికింద్రాబాద్‌ను ముక్కలు చేస్తే ఊరుకునేది లేదని, వెంటనే సికింద్రాబాద్‌ను ప్రత్యేక కార్పొరేషన్‌తో పాటు జిల్లాగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. తమ తల్లిదండ్రుల పేర్లు మార్చితే ఎంత కోపం వస్తుందో.. తమ ప్రాంతం పేరు మార్చినా అంతే ఆవేశం వస్తుందన్నారు. రేవంత్ రెడ్డి ఇష్టానుసారం చేస్తానంటే నడవదని తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు.
అభివృద్ధి శూన్యం.. నాశనం మెండు!
కేసీఆర్ పాలనలో హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఎదిగిందని.. నిజాం కాలం నుండి సాగుతున్న అభివృద్ధిని గత పదేళ్లలో తారస్థాయికి తీసుకెళ్లామని తలసాని శ్రీనివాస్ యాదవ్ గుర్తుచేశారు. సైబరాబాద్, శంషాబాద్ ఒకప్పుడు చిన్న గ్రామాలు.. అవి నేడు ప్రపంచ స్థాయికి చేరాయన్నారు. ఈ రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా? అభివృద్ధిని పక్కనపెట్టి ఉన్నదాన్ని సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు.
డీలిమిటేషన్ - ఒక తప్పుల తడక
జీహెచ్‌ఎంసీ డివిజన్ల పునర్విభజన తీరుపై తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ డివిజన్ల పునర్విభజన ప్రక్రియ మొత్తం తప్పుల తడకగా ఉందని విమర్శించారు. కనీసం మేయర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు తెలియకుండా డివిజన్ల విభజన ఎలా చేస్తారని ప్రశ్నించారు. 150 డివిజన్లను 300 చేస్తామంటున్న ప్రభుత్వం.. ప్రజలతో గానీ, ప్రజాప్రతినిధులతో గానీ చర్చించలేదని ధ్వజమెత్తారు. మనుషుల మనోభావాలతో ఆడుకుంటే రాజకీయ పతనం తప్పదని హెచ్చరించారు.
ఉద్యమ కార్యాచరణ ఇదే..
సికింద్రాబాద్‌ను ప్రత్యేక జిల్లాగా, గ్రేటర్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ తలసాని శ్రీనివాస్ యాదవ్ భారీ కార్యాచరణను ప్రకటించారు. ఈనెల 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వేలాది మందితో 'నల్లజెండాల శాంతియాత్ర' చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ జేబీఎస్ ముట్టడి కార్యక్రమం ఉంటుందన్నారు. శాంతియాత్ర అనంతరం సికింద్రాబాద్ బంద్‌కు పిలుపునిస్తామని తలసాని చెప్పారు. సంక్రాంతి తర్వాత పూర్తిస్థాయి కార్యాచరణ.. రిలే నిరాహార దీక్షలు చేపడతామన్నారు. అవసరమైతే ఆమరణ దీక్ష చేపట్టనున్నట్లు తలసాని స్పష్టం చేశారు. ఇది రాజకీయాలకు అతీతమైన పోరాటం. సికింద్రాబాద్‌లో పుట్టిన ప్రతి బిడ్డ ఈ ఉద్యమంలో భాగస్వామి కావాలి. పార్టీలకంటే మన ప్రాంత ఆత్మగౌరవమే ముఖ్యమని తలసాని పిలుపునిచ్చారు.



