అక్రమ మద్యం రవాణాకు అడ్డుకట్ట

అక్రమ మద్యం రవాణాకు అడ్డుకట్ట

  • 73 మద్యం సీసాలు స్వాధీనం

విశ్వంభర, హైదరాబాద్ : నగర పరిధిలో ఎక్సైజ్ ఎస్‌టీఎఫ్ బృందాలు చేపట్టిన వాహనాల తనిఖీల్లో మొత్తం 73 నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నాయి. రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ  తనిఖీల్లో  ఢిల్లీ, గోవా, హర్యానా తదితర ప్రాంతాల నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్నట్లు గుర్తించారు. శంషాబాద్ రోడ్డులో ఎస్‌టీఎఫ్ సీ టీం సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై మంజు సిబ్బంది కలిసి వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఎయిర్‌పోర్టు మార్గంగా ఇతర రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ తరలిస్తున్నారనే సమాచారం మేరకు తనిఖీలు చేపట్టగా 30 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన సీసాలను శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు. ఇక పహాడ్ షరీఫ్ ప్రాంతంలో ఎక్సైజ్ ఎస్‌టీఎఫ్ డీ టీం సీఐ నాగరాజు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 43 నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మద్యం ఢిల్లీ, గోవా తదితర ప్రాంతాల నుంచి విమానాల ద్వారా తీసుకువచ్చినట్లు విచారణలో వెల్లడైంది. స్వాధీనం చేసుకున్న సీసాలను మీర్‌పేట్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించినట్లు సీఐ నాగరాజు తెలిపారు. నగరంలో అక్రమ మద్యం రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.

Tags: