అమ్మానాన్నలను కాదంటే జీతంలో కోత
కొత్త చట్టానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
అమ్మానాన్నలను కాదనుకుని, వృద్ధాప్యంలో వారిని కంటికి రెప్పలా చూసుకోని ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది.
విశ్వంభర, బ్యూరో: అమ్మానాన్నలను కాదనుకుని, వృద్ధాప్యంలో వారిని కంటికి రెప్పలా చూసుకోని ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. తమ రక్తాన్ని చెమటగా మార్చి పిల్లలను ఉన్నత స్థాయికి చేర్చిన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అటువంటి ఉద్యోగుల నెలవారీ వేతనం నుంచి 10 నుంచి 15 శాతం మొత్తాన్ని కోత విధించి, నేరుగా వారి తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్లు ఆయన సంచలన ప్రకటన చేశారు.
హైదరాబాద్‌లోని శిల్పాకళా వేదికలో కొత్తగా ఎంపికైన గ్రూప్-2 అధికారులకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో సీఎం ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగికి ప్రతి నెల ఒకటో తేదీన జీతం ఎలా పడుతుందో, వారి తల్లిదండ్రులకు కూడా అదే రోజున నిర్ణీత మొత్తం (10-15%) వారి ఖాతాల్లో జమైపోతుందన్నారు. ఈ చట్టానికి సంబంధించిన విధివిధానాలు, నిబంధనలను రూపొందించే బాధ్యతను కొత్తగా విధుల్లో చేరుతున్న అధికారులకే అప్పగిస్తున్నట్లు సీఎం తెలిపారు. దీనిపై తక్షణమే కసరత్తు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
కొడుకైనా, కూతురైనా బాధ్యత తప్పదు..
తల్లిదండ్రుల పట్ల బాధ్యత కేవలం కుమారులకే కాదని, కుమార్తెలకు కూడా ఉంటుందని సీఎం గుర్తుచేశారు. "పెళ్లయ్యాక ఆడపిల్లలకు అత్తగారి ఇల్లు ఎంత ముఖ్యమో, పుట్టినిల్లు కూడా అంతే ముఖ్యం. కొడుకులకు కట్నాలు, కార్లు రావచ్చు.. కానీ కన్నవారిని రోడ్డున పడేయడం క్షమార్హం కాదు" అని ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. తాము కేవలం శిక్షించడం కోసం కాకుండా, సమాజంలో నైతిక విలువలను కాపాడటం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. మీరు ఈ రోజు అధికారి కుర్చీలో కూర్చున్నారంటే దానికి కారణం మీ తల్లిదండ్రుల త్యాగమేనని, ఆ వేళ్లను మరిచిపోవద్దని.. మీ దగ్గరకు వచ్చే పేద ప్రజల్లోనూ మీ తల్లిదండ్రులను చూసుకోవాలన్నారు.



