హైదరాబాద్ వేదికగా మరో అంతర్జాతీయ క్రీడా సంబరం
మార్చి 8 నుంచి పోరు ప్రారంభం..
భాగ్యనగరం మరో అంతర్జాతీయ క్రీడా సంబరానికి వేదిక కానుంది. మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని హైదరాబాద్ దక్కించుకుంది.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: భాగ్యనగరం మరో అంతర్జాతీయ క్రీడా సంబరానికి వేదిక కానుంది. మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని హైదరాబాద్ దక్కించుకుంది. ఈ మేరకు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (FIH) ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వంతో అధికారికంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షుడు తయ్యబ్ ఇక్రామ్ మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టోర్నీ నిర్వహణ, వసతులు, క్రీడా ప్రాంగణాల అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించిన అధికారిక పోస్టర్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారత హాకీ సమాఖ్య (హెచ్‌ఐ) అధ్యక్ష, కార్యదర్శులు దిలీప్ తిర్కీ, భోలానాథ్ సింగ్‌తో పాటు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, సలహాదారు జితేందర్ రెడ్డి, క్రీడా కార్యదర్శి జయేశ్ రంజన్, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనీబాలాదేవి, తదితరులు పాల్గొన్నారు.
క్రీడా హబ్‌గా హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణను గ్లోబల్ స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయి హాకీ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి తమ ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని చెప్పారు. ఈ టోర్నీ నిర్వహించడం ద్వారా మున్ముందు నగరాన్ని అత్యుత్తమ స్థాయి క్రీడా కేంద్రంగా మార్చే క్రమంలో ఇది మరో ముందడుగు అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
టోర్నీ విశేషాలివే
మహిళల హాకీ వరల్డ్‌కప్‌లో భాగంగా జరిగే క్వాలిఫయింగ్ టోర్నీని హైదరాబాద్ గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహిస్తారు. మార్చి 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఈ పోటీలు జరుగుతాయి. ఇందులో భారత్‌తో పాటు ఇంగ్లండ్, స్కాట్లాండ్, దక్షిణ కొరియా, ఇటలీ, ఉరుగ్వే, వేల్స్, ఆస్ట్రియా మొత్తం 8 జట్లు పాల్గొననున్నాయి. ఈ టోర్నీలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా మహిళల హాకీ వరల్డ్ కప్‌కు అర్హత సాధిస్తాయి. సొంతగడ్డపై భారత మహిళల జట్టు సత్తా చాటి వరల్డ్ కప్ బెర్తును ఖాయం చేసుకోవాలని క్రీడాభిమానులు కోరుకుంటున్నారు. ఈ టోర్నీ కోసం గచ్చిబౌలిలోని హాకీ స్టేడియంను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సిద్ధం చేయనున్నారు.



