తమిళనాట మోగనున్న 'విజిల్'

తమిళనాట మోగనున్న 'విజిల్'

తమిళ సినీ స్టార్ హీరో, 'దళపతి' విజయ్ రాజకీయ ప్రయాణంలో మరో కీలక అంకం ఆవిష్కృతమైంది.

విశ్వంభర, నేషనల్ బ్యూరో: తమిళ సినీ స్టార్ హీరో, 'దళపతి' విజయ్ రాజకీయ ప్రయాణంలో మరో కీలక అంకం ఆవిష్కృతమైంది. ఆయన స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల గుర్తును కేటాయించింది. పార్టీ కోరిక మేరకు 'విజిల్' గుర్తును కేటాయిస్తూ గురువారం అధికారిక ప్రకటన వెలువడింది. విజయ్ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా భారీ బహిరంగ సభలను నిర్వహించి తన బలాన్ని నిరూపించుకున్నారు. ఇప్పుడు ఎన్నికల గుర్తు కూడా రావడంతో పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం కానుంది.

ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే దిశగా..
తమిళనాడులో దశాబ్దాలుగా కొనసాగుతున్న ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి చెక్ పెట్టడమే లక్ష్యంగా విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. పార్టీ పెట్టిన కొద్ది కాలంలోనే రికార్డు స్థాయిలో సభ్యత్వ నమోదు చేపట్టి, తన సత్తా చాటారు. ఇటీవలే విక్రవాండిలో నిర్వహించిన భారీ బహిరంగ సభ ద్వారా తన రాజకీయ విధివిధానాలను ప్రకటించిన విజయ్, ఇప్పుడు 'విజిల్' గుర్తుతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ గుర్తుతోనే అన్ని స్థానాల్లో తమ అభ్యర్థులు బరిలోకి దిగుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Read More హిందీపై మారన్ సంచలన వ్యాఖ్యలు.. బానిసత్వానికి దారి..!!

కష్టాల్లో ఉన్న వేళ 'తీపి' కబురు
గత కొద్ది రోజులుగా విజయ్ వరుస ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కరూర్‌లో నిర్వహించిన పార్టీ కార్యక్రమ సమయంలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన రాజకీయంగా కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు ఇప్పటికే రెండు విడతలుగా విజయ్‌ను సుదీర్ఘంగా విచారించారు. ఈ విచారణలు కొనసాగుతున్న తరుణంలోనే, ఈసీ నుంచి పార్టీకి గుర్తు కేటాయించడం విజయ్ వర్గానికి పెద్ద ఊరటనిచ్చింది.

విజిల్ వెనుక విశిష్టత!
గతంలో విజయ్ నటించిన పలు సినిమాల్లో 'విజిల్' థీమ్ సాంగ్స్, మ్యానరిజమ్స్ ఆయన అభిమానుల్లో ఎంతో పాపులర్. యువతను, సామాన్య ప్రజలను ఆకట్టుకునే విధంగా ఈ గుర్తు ఉండటంతో ఎన్నికల ప్రచారంలో ఇది కలిసి వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ గుర్తు కేటాయింపుపై పార్టీ నాయకులు స్పందిస్తూ.. "ప్రజల కష్టాలను గుర్తించి ప్రభుత్వంపై విజిల్ వేసే ధైర్యం మా పార్టీకి ఉందని, ఈ గుర్తు గెలుపుకు సంకేతం" అని పేర్కొన్నారు. విజయ్ తన సినిమాలకు స్వస్తి చెప్పి పూర్తిస్థాయి రాజకీయాలపై దృష్టి సారించిన వేళ, 'విజిల్' గుర్తుతో ఆయన ప్రచారం ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.