హిందీపై మారన్ సంచలన వ్యాఖ్యలు.. బానిసత్వానికి దారి..!!
విశ్వంభర, నేషనల్ బ్యూరో: డీఎంకే ఎంపీ దయానిధి మారన్ చేసిన తాజా వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ, సామాజిక చర్చకు దారితీశాయి.
విశ్వంభర, నేషనల్ బ్యూరో: డీఎంకే ఎంపీ దయానిధి మారన్ చేసిన తాజా వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ, సామాజిక చర్చకు దారితీశాయి. చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో మహిళల పాత్రను ఇంటికే పరిమితం చేస్తూ, వంటగది పనులు చేయడం, పిల్లలను పెంచడమే ప్రధాన బాధ్యతగా చూపిస్తున్నారని విమర్శించారు. అక్కడి విద్యా వ్యవస్థలు హిందీకి మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ, ఇంగ్లీష్ విద్యను నిరుత్సాహపరుస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ విధానాల వల్లే ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయని, దక్షిణ భారతదేశానికి వలసలు పెరుగుతున్నాయని మారన్ అభిప్రాయపడ్డారు. ఇంగ్లీష్ చదవొద్దని భయపెట్టడం ద్వారా ప్రజలను బానిసలుగా మార్చినట్టేనని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.
తమిళనాడులో మహిళా విద్యకు ఇచ్చే ప్రాధాన్యమే రాష్ట్ర ఆర్థిక పురోగతికి ప్రధాన బలమని మారన్ పేర్కొన్నారు. ద్రావిడ మోడల్ పాలనలో బాలికలు, బాలురు అనే తేడా లేకుండా అందరికీ సమాన విద్యా అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. విద్యావంతులైన యువత వల్లే అంతర్జాతీయ స్థాయి కంపెనీలు తమిళనాడులో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని వివరించారు. కొన్ని రాష్ట్రాల్లో భాషా పరిమితులు నిరుద్యోగాన్ని పెంచుతున్నాయని, ఇంగ్లీష్ మీడియం విద్య లేకపోతే యువత భవిష్యత్తు దెబ్బతింటుందని హెచ్చరించారు. భాషపై ఆంక్షలు అభివృద్ధికి, ఉపాధికి అడ్డుగా మారతాయని ఆయన అన్నారు. ఈ విధానాల ఫలితంగానే తమిళనాడులో అక్షరాస్యత రేటు, మహిళల ఉద్యోగ భాగస్వామ్యం గణనీయంగా పెరిగాయని మారన్ తెలిపారు.
మారన్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. హిందీ మాట్లాడే ప్రజలను తక్కువగా చూపించేలా వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని బీజేపీ నేత తిరుపతి నారాయణన్ విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై మారన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదే సమయంలో డీఎంకే నేత టీకేఎస్ ఇళంగోవన్ మారన్ వ్యాఖ్యలకు మద్దతుగా నిలిచారు. మహిళల హక్కులు, విద్య రాష్ట్ర పాలనపై ఆధారపడి ఉంటాయని, తమిళనాడులో మహిళా సాధికారత కోసం తమ పార్టీ ప్రారంభం నుంచే పోరాడుతోందని చెప్పారు. మహిళలకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత డీఎంకేకేనని ఆయన వ్యాఖ్యానించారు.



