ప్రభుత్వ భూములలో నుండి అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్ పట్టివేత
విశ్వంభర, షాబాద్:- ప్రభుత్వ భూములలో నుండి అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్ ను చేవెళ్ల జోన్ SOT పోలీసులు గురువారం తెల్లవారుజామున పట్టుకున్నారు. పోతుగల్ గ్రామానికి చెందిన కరుణాకర్ రెడ్డి మరికొంత మంది వ్యక్తులు సిండికేట్ గా మారి పోతుగల్ తండా గ్రామ శివార్లలోని ప్రభుత్వ లావాని భూముల్లో నుండి JCB ల సహాయంతో మట్టిని తవ్వి షాబాద్ మండల పరిసర గ్రామాలకు అమ్ముకుంటున్నారు. గత కొన్ని రోజులుగా అర్ధరాత్రి పూట మాత్రమే సాగుతున్న ఈ తతంగాన్ని గుర్తించిన SOT పోలీసులు గురువారం తెల్లవారుజామున పోతుగల్ తండా శివారులో కాపుకాచి మట్టిని తరలిస్తున్న ఒక టిప్పర్ TG 12T2745 ను పట్టుకోవడం జరిగింది. ఇట్టి టిప్పర్ ను నడుపుతున్న శ్రీనివాస్ R/o పోతుగల్ అనే వ్యక్తితో పాటు మట్టి లోడ్ గల టిప్పర్ ను షాబాద్ పోలీసులకు అప్పగించారు. టిప్పర్ యజమాని అయినటువంటి పోతుగల్ గ్రామానికి చెందిన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వ భూములలో నుండి ప్రభుత్వం తరఫున ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపినా, ఆ మట్టిని అమ్ముకున్న వారిని ఉపేక్షించేది లేదని పోలీసులు తెలిపారు.



