కేరళ కాంగ్రెస్‌లో ‘థరూర్’ కలకలం
వచ్చే కేరళ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటకొచ్చాయి.
విశ్వంభర, నేషనల్ బ్యూరో: వచ్చే కేరళ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటకొచ్చాయి. ఎన్నికల వ్యూహరచన కోసం ఢిల్లీలో నిర్వహించిన అత్యంత కీలకమైన సమావేశానికి ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ గైర్హాజరు కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రధాని మోదీ తన నియోజకవర్గమైన తిరువనంతపురంలో పర్యటిస్తున్న సమయంలోనే, థరూర్ ఢిల్లీ భేటీకి వెళ్లకుండా కేరళలోనే ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
రాహుల్‌తో పెరిగిన దూరం?
ఇటీవల కొచ్చిలో జరిగిన ఒక కార్యక్రమంలో రాహుల్ గాంధీ ప్రవర్తనపై థరూర్ అసహనంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రాహుల్ తనతో సరిగా వ్యవహరించలేదని, ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టారని భావిస్తున్న థరూర్.. ఈ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన తన పట్ల రాష్ట్ర నాయకత్వం అనుసరిస్తున్న తీరుపై ఆయన తీవ్ర కలత చెందారని సమాచారం.
గతంలో పలుమార్లు ప్రధాని మోదీ పనితీరును థరూర్ ప్రశంసించడం కాంగ్రెస్ అధిష్ఠానానికి మింగుడుపడటం లేదు. కేరళ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలపై చర్చించేందుకు పిలిచిన భేటీని ఆయన దాటవేయడంపై చర్చ సాగుతోంది. అయితే, ఈ విమర్శలపై శశిథరూర్ కార్యాలయం స్పందించింది. రాజకీయ కారణాల వల్ల భేటీకి దూరం కాలేదని స్పష్టం చేసింది. కొలికోడ్‌లో జరుగుతున్న అంతర్జాతీయ లిటరేచర్ ఫెస్ట్ లో ముందుగా నిర్ణయించిన కార్యక్రమం ఉన్నందున ఆయన కేరళలోనే ఉన్నారని వివరణ ఇచ్చింది. రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో సీనియర్ నేతల మధ్య సమన్వయం లోపిస్తే అది పార్టీ విజయవకాశాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.



