మోడీ, అమిత్ షాకు కోర్టులంటే గౌరవం లేదు.. షబ్బీర్ అలీ కీలక వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ప్రచారం మొత్తం రిజర్వేషన్ల అంశం చుట్టూ తిరిగింది. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తుందని కాంగ్రెస్ చేసిన ప్రచారం బలంగా ప్రజల్లోకి వెళ్లింది. దీనికి అమిత్ షా, మోడీ సహా బీజేపీ నేతలు మొత్తం సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. రిజర్వేషన్లు తొలగించే ఉద్దేశ్యం తమకు లేదని మోడీ కూడా వివరణ ఇవ్వాల్సి వచ్చింది. రిజర్వేషన్ల అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరగడానికి ప్రధాన కారణం తెలంగణ సీఎం రేవంత్ రెడ్డి.
అయితే.. బీజేపీ దానికి కౌంటర్‌గా ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని ప్రకటించింది. ఇది కూడా దేశ వ్యాప్తంగా దుమారమైంది. దీనిపై తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మోడీ, అమిత్ షాకు కోర్టులంటే లెక్కలేదని విమర్శించారు. అందుకే కోర్టు పరిధిలో ఉన్న అంశాలను ఎన్నికల్లో ప్రచారంలో వాడకుంటున్నారని మండిపడ్డారు. ముస్లిం రిజర్వేషన్ల అంశం సుప్రీంకోర్టులో ఉందని గుర్తు చేశారు. న్యాయస్థానంలో విచారణలో అంశంపై మోడీ, అమిత్ షా ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు.
అసలు ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ నేతలు ఎలా చెబుతారని ఫైర్ అయ్యారు. ముస్లింలలో రిజర్వేషన్లు అందరికీ లేవని.. కేవలం వెనబడిన వారికి మాత్రమే ఉన్నాయని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ముస్లిం రిజర్వేషన్లుపై మాట్లాడి.. మత చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారని షబ్బీర్ అలీ.. బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.