కష్టపడే వారికే కాంగ్రెస్‌లో గుర్తింపు..డీసీసీ శిక్షణా కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
వికారాబాద్‌లో జరుగుతున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల శిక్షణా తరగతుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ప్రతి ఒక్కరి పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని, మెరిట్ ఉన్న వారికి కచ్చితంగా న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: వికారాబాద్‌లో జరుగుతున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల శిక్షణా తరగతుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ప్రతి ఒక్కరి పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని, మెరిట్ ఉన్న వారికి కచ్చితంగా న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. డీసీసీ పదవి ఎంతో విలువైనదని, వచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినయోగం చేయవద్దని సూచించారు. వారసత్వంగా ఎవరికీ అవకాశాలు రావని, మనం పడే కష్టం, శ్రమ ఎప్పటికీ వృథా పోవని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ శిక్షణను శిక్షగా భావించవద్దని కోరారు.
డీసీసీలుగా ఎన్నికైనంత మాత్రాన ఆ జిల్లాలపై తమదే ఆధిపత్యమని, తామే అధిపతులమని భావిస్తే అది పెద్ద తప్పిదమని రేవంత్ హెచ్చరించారు. డీసీసీ పోస్టు అనేది కేవలం అధికారం మాత్రమే కాదని, అది ఒక కుటుంబ పెద్దలాంటి బాధ్యత అని గుర్తు చేశారు. పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే వారు ఉంటారని, ఇది మహాత్మా గాంధీ కాలం నుండి కొనసాగుతున్న సంప్రదాయమని పేర్కొన్నారు. భిన్న స్వరాలను ప్రజాస్వామ్య స్ఫూర్తితో స్వీకరించాలే తప్ప, వ్యతిరేకించే వారిని పార్టీ నుంచి బయటకు పంపాలని చూస్తే అది పార్టీకి కీడు చేసినట్లవుతుందని హితవు పలికారు.
తాను పీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన సమయంలో పార్టీ పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందని, సొంత పార్టీలోనే కొందరి నుంచి వ్యతిరేకత ఎదురైందని ఈ సందర్భంగా రేవంత్ గుర్తు చేసుకున్నారు. అయినప్పటికీ నేతలందరి ఇళ్లకు వెళ్లి వారిని కలిసినట్లు వివరించారు. వయసులో, అనుభవంలో చిన్నవాడినైనా పార్టీ తనకు అవకాశం ఇచ్చిందని, సహకరించాలని కోరి అందరినీ ఒప్పించినట్లు చెప్పారు. అందరం సమిష్టిగా కృషి చేయడం వల్లే పార్టీ ఓటింగ్ శాతం 2.5 నుండి 40 శాతానికి చేరిందని విశ్లేషించారు. గతంలో డీసీసీ అధ్యక్షులుగా బాగా పనిచేసిన వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చామని, అక్కడ అవకాశం రాని వారికి ఎమ్మెల్సీ పదవులు కల్పించామని తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన మరో 60 మందికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చామని, కష్టపడే ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు.



