హామీలు గాలికి.. వసూళ్లే లక్ష్యం..రేవంత్ ప్రభుత్వంపై బండి సంజయ్ ధ్వజం
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్నాళ్లవుతున్నా ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్నాళ్లవుతున్నా ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేవలం తన కుర్చీని కాపాడుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజల అభివృద్ధిపై లేదని విమర్శించారు. ఢిల్లీలోని పెద్దలకు వేల కోట్ల రూపాయలు పంపడంపైనే మంత్రివర్గ సమావేశాల్లో చర్చలు జరుగుతున్నాయని, సామాన్యుల సమస్యలను ప్రభుత్వం గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీల ప్రకారం మహిళలకు నెలకు రూ.2500లు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.
నిరుద్యోగులు, విద్యార్థులపై నిర్లక్ష్యం
నిరుద్యోగులకు భృతి, విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డులు ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని బండి సంజయ్ నిలదీశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల వేలాది విద్యా సంస్థలు, లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఆరోగ్యశ్రీ బకాయిలు పేరుకుపోవడంతో కార్పొరేట్ ఆసుపత్రులు పేదలకు వైద్యం అందించడం లేదని, ఇది ప్రభుత్వ వైఫల్యమేనని స్పష్టం చేశారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏలు, రిటైర్డ్ ఉద్యోగుల ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని మండిపడ్డారు.
ఆరు గ్యారంటీలే లక్ష్యంగా పోరాటం
కాంగ్రెస్ ప్రకటించిన 420 హామీలు, ఆరు గ్యారంటీలను ఎప్పటి నుంచి అమలు చేస్తారో, వాటికి ఎంత బడ్జెట్ కేటాయిస్తారో కేబినెట్ సమావేశంలో చర్చించి స్పష్టమైన తేదీని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నిరంతరం పోరాడుతుందని, ప్రభుత్వం తన బాధ్యతలను విస్మరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
భాగ్యలక్ష్మి ఆలయానికి బీజేపీ ప్రజాప్రతినిధులు
మంగళవారం పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయ సందర్శనకు బీజేపీ సిద్ధమైంది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో కలిసి బండి సంజయ్, రామచందర్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఉదయం బీజేపీ కార్యాలయం నుంచి బయలుదేరి భాగ్యలక్ష్మి ఆలయం, అనంతరం లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.



