నౌకాయానంలో భారత్ ఘనత
ఆధునిక సాంకేతికతకు, పురాతన విజ్ఞానాన్ని జోడించి రూపొందించిన ‘ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్య’ తన తొలి సుదీర్ఘ అంతర్జాతీయ యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుంది.
విశ్వంభర, నేషనల్ బ్యూరో: భారత నౌకాదళం చరిత్ర సృష్టించింది. ఆధునిక సాంకేతికతకు, పురాతన విజ్ఞానాన్ని జోడించి రూపొందించిన ‘ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్య’ తన తొలి సుదీర్ఘ అంతర్జాతీయ యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుంది. గుజరాత్‌లోని పోరుబందర్ నుంచి బయల్దేరిన ఈ నౌక.. ఎలాంటి ఇంజిన్ సాయం లేకుండా, కేవలం తెరచాపల సాయంతో పయనించి బుధవారం ఒమన్ రాజధాని మస్కట్ తీరానికి చేరుకుంది. మస్కట్‌కు చేరుకున్న అనంతరం ఓడలోని సిబ్బంది సంబరాలు చేసుకున్నారు.
గత నెల 29న గుజరాత్‌లోని పోరుబందర్ నుంచి బయల్దేరిన ఈ నౌక.. 18 మంది సిబ్బందితో 18 రోజుల పాటు ప్రయాణించింది. సుమారు సుమారు 750 నాటికల్ మైళ్లు (1,400 కిలోమీటర్లు) ప్రయాణించింది. ఎలాంటి ఇంజిన్ లేకుండా కేవలం తెరల సహాయంతో కొనసాగిన ఈ ప్రయాణం భారతదేశ ప్రాచీన సముద్రయాణ వైభవానికి, అద్వితీయమైన నౌకా నిర్మాణ కౌశల్యానికి ప్రతీకగా నిలిచింది.
అజంతా స్ఫూర్తితో.. ఆధునిక సృష్టి
ఈ నౌక నిర్మాణం వెనుక 1,500 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. క్రీస్తు శకం 5వ శతాబ్దానికి చెందిన అజంతా గుహల్లోని ఒక ఓడ చిత్రం ఆధారంగా కేరళకు చెందిన నిపుణులైన కార్మికులు దీనిని రూపొందించారు. నౌక పొడవు 65 అడుగులు, వెడల్పు 22 అడుగులు, ఎత్తు 13 అడుగులతో రూపొందించారు. ఈ నౌక తయారీలో ఎక్కడా ఒక్క లోహపు మేకును కూడా వాడకపోవడం విశేషం. చెక్క పలకలను ఒకదానికొకటి కొబ్బరి తాడు, పీచుసహాయంతో కుట్టినట్టుగా జత చేశారు. సముద్రపు ఉప్పు నీటి నుంచి కలపను రక్షించేందుకు సహజ సిద్ధమైన రెసిన్ (జిగురు) పూతను వాడారు.
నౌకపై కొలువుదీరిన ప్రాచీన చిహ్నాలు
ఈ ఓడకు పూర్వ కాలంలో మన దేశం నుంచి ఆగ్నేయాసియా దేశాలకు ఓడలను నడిపిన దిగ్గజ నావికుడు కౌండిన్య పేరును ఈ ఓడకు పెట్టారు. నౌక తరచాలపై గండభేరుండ పక్షి, సూర్యుడి రూపాలను చిత్రించారు. ముందు భాగంలో సింహాయాళి ప్రతిరూపాన్ని తీర్చిదిద్దారు. హరప్పా శైలికి ప్రతి రూపంలో ఉండే లంగరు బొమ్మను డెక్ పై ఉంచారు.



